పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తమ చాళుక్యుడు

253

మొగలిచర్లకు చేరినవెంటనే అచ్చట దేవికి వీరభద్ర మహారాజు పేర అర్చనలు జరిగినవి, వడ్డపల్లెలో, మొగలిచర్లలో మహారాణి పూజలు చేయించిన వైనము తెలియవచ్చెను.

పూజలు పూర్తిచేసుకొని మొగలిచర్ల నుంచి తన్ననుసరించిన అశ్వికులతో శ్రీ చాళుక్య వీరభద్రమహారాజు ప్రయాణము సాగించెను. మూడు గవ్యూతుల దూరము వచ్చేసరికి దూరముగా ఒక చిన్న సేన ఆగిఉన్నట్లు వీరభద్రమహారాజునకు పొడగట్టెను. వెంటనే తన సైనికుల కందరికీ ఉత్సాహపూరిత వచనాలు పలికి, తన చిన్నసేనను అర్ధచంద్రవ్యూహంగా రచించి ముందుకు చొచ్చుకొని పోయినాడు వీరభద్రమహారాజు.

హరిహరదేవ మురారిదేవులకూ, రుద్రమకూ దూరంగా ఏదోచిన్న సైన్యం వచ్చుచున్నట్లు కనబడినది. ఆ సేనవచ్చేలోపలనే రుద్రదేవిని హతమార్చాలని హరిహర మురారిదేవులును; తన సైన్యమూ తన ప్రాణమూ బలియిచ్చి అయినా ఆ సేన వచ్చేవరకూ చక్రవర్తిని రక్షించితీరాలని రేచర్ల రుద్రప్రభువును సిద్ధమై ఉండిరి.

రేచర్ల రుద్రుడు హరిహరదేవుని చూచి ‘ఓయి వెఱ్ఱిమహారాజా! మీరు శ్రీరుద్రచక్రవర్తిని హతమార్చి లాభం పొందాలని చూస్తున్నారు. కాని చక్రవర్తిని హతమార్చడానికి ప్రయత్నించేలోగా మీ ప్రాణాలు మీకు దక్కితేకద? ఇది నేను హాస్యంగాగాని, బడాయిగాగాని అనుటలేదు’ అనెను.

రుద్రదేవి హరిహరదేవునిచూచి ‘హరిహరదేవప్రభూ! నువ్వుగానీ, నీ తమ్ముడుగానీ నన్ను పట్టుకోలేరు. నాలుగువేలమంది సైనికులతో, గజములతో దారికి అడ్డంరావడానికి నువ్వు సాహసించావు. నలభైవేలసేనతో, గజాలతో వచ్చినా నీకు విజయంకాదు. నీ ప్రాణం కోల్పోవడమే అవుతుంది’ అని తెలిపినది.

అన్నాంబిక లేచి రథముమీద నిలుచుండి ‘ఓయి అవినీతిపరుడా! దొంగ తనంవల్ల రాజ్యాలు నిర్మాణంకావు. మగటిమి కలవాడవయితే ఇదివరకే నీ రాజ్యం నువ్వు నిర్మించుకొనే ఉందువు. మా ప్రాణాలు పోవుగాని మీప్రాణాలు మాత్రం బలి అవుతాయి’ అని కేకవేసి బాణం ఎక్కుపెట్టి హరిహరదేవునిపై గురిపెట్టింది.

ఆ వెంటనే మురారిదేవుని బాణంవచ్చి అన్నాంబిక ధనుస్సును రెండు తుండెములు చేసెను. మురారిదేవుడు మరల బాణం సంధించే లోపుగా, ఒక నిశితభల్ల మెక్కడినుండియో మహా వేగమున వచ్చి ఆతని కంఠాన సువ్వున లోతుగా నాటుకొన్నది.