పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

252

గోన గన్నా రెడ్డి

ఆ యధర్మానికి మకుటాయమానంగా రాచగద్దెమీద ఆడదా నెక్కించటమా!’ అన్నాడు.

అప్పుడు ముమ్మక్క రథంమీద లేచి నిలుచుండి, ‘హరిహరదేవ మహారాజా! తాము ఈ విషయం శ్రీ గణపతిదేవ చక్రవర్తులనే అడిగి ధర్మ నిర్ణయం ఎందుకు చేసుకోలేదు?’ అని ప్రశ్నించింది.

మురా: మాకు ఆడవాళ్ళతో మాటలు పనికిరావు. రేచర్లరుద్రుడా! ఏమంటావు? నీ సైన్యాలన్నీ ఆయుధవిసర్జనం చేస్తాయా, ఎక్కడివారి నక్కడే హతమార్చమా?

హరి: మీరు ఆయుధాలు విసర్జించి, గుఱ్ఱాలు దిగి నడచిపోండి. లేదా, రుద్రదేవీ, ముమ్మక్క.... ఆ మూడో అమ్మాయిల ప్రాణాలు దక్కగలవని మేము చెప్పలేము.

5

తన ఉత్తమాశ్వం పై ప్రళయ ఝంఝలా, ధనుర్వినిర్ముక్త శఠంలా, భక్తుని కాంక్షలా శ్రీచాళుక్య వీరభద్ర మహారాజు మహా ప్లతగతిని పోవుచుండెను. ఆయన ఆలోచనలు లోకాలంతటా పరువిడుచున్నవి. రక్షకసేనా పరివేష్ఠితయై యున్న సామ్రాజ్ఞికి భయమేమిటి? అది తనలో ఉన్న కోర్కెలవల్ల ఉద్భవించిన భయముకాబోలు! అయినా ఇప్పుడు అక్కడక్కడ సామంతులలోఉన్న దుష్టత్వాలు, యాదవుల దుండగీడుతనం తలచుకొనగా, మనస్సు పరిపరివిధాల పోవుచున్నది. తీరా, తాను రుద్రాంబికను కలుసుకొన్నప్పుడు ఏ ఆపదా లేకపోయినచో తన యత్నము నవ్వులపాలగును. అంతకంటె ఆపద ఏమీ సంభవించదుకద! ఒక వేళ ఏమూలనో ఒదిగిఉన్న ఆపద విజృంభిస్తే, తనరాక ఆ ఆపత్తును అరికట్టగలిగితే తాను వెళ్ళకపోయి ఉండడము ఈ భూమి ఉన్నంతకాలము మరువరాని భయంకర సంఘటనగా పరిణమించవచ్చునుగదా?

రాజసేవలో ఛాందసమున్నా క్షమింపవచ్చునుగాని ప్రమత్తతఉంటే కోటి జన్మలకైనా క్షమార్హముకాదు. ప్రేమసేవా అంతే! ఒక రేమను కొందురో యని ధర్మాచరణం ఉపేక్షించుట అధర్మమే అవుతుంది. ధర్మాచరణం లోకాభిప్రాయ సంబంధము కలది కానేకాదు.

చాళుక్య వీరభద్రుడు వడ్డపల్లెకు జాముప్రొద్దెక్కునప్పటికి చేరినాడు. వడ్డపల్లె పురవాసులు చాళుక్య వీరభద్రమహారాజు ఒంటిగా రావడంచూచి ఆశ్చర్యమందినారు. గ్రామాధిపతీ, పెద్దలూ వీరభద్ర మహారాజునకు గౌరవాలన్నీ జరిపినారు. మహారాజు స్నానాదికాలన్నీ నెరవేర్చి బుద్ధగణపతికి సహస్రనామ పూజాది అర్చనలు అర్పించి, అచ్చట ఒక సేనాపతి ఇంట భోజనమాచరించి, విశ్రయించి మొగలిచెర్లకు ఏకవీరాదేవిని అర్చింప తన ఉత్తమ అశ్వము నెక్కిప్రయాణ మాయెను. వడ్డపల్లెనుండి నూర్గురు అశ్వికులు మహారాజుననుసరించారు.