పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

248

గోన గన్నా రెడ్డి

వట్టి లింగమూర్తి పూజతో తృప్తిపడిన చాళుక్యశిల్పి శైవలీలావినోది అయినాడు. రాష్ట్రకూట వంశావరణంలో కాకతీయ రసపూర్ణ జీవిత ప్రాబల్యాన ఆంధ్రశిల్ప నృత్య విన్యాసకుడు, దివ్యసౌందర్య లీలావిలాసుడు, అలంకార పూరితాత్ముడు ఆయెను.

మొగలిచర్ల కాకతమ్మగుడి శ్రీ కాకతీయ ప్రోలమహారాజు ప్రథమ తనయుడయిన శ్రీ రుద్రచక్రవర్తి కట్టించినాడు. ప్రసిద్ధాంధ్ర శిల్పి ఎఱ్ఱయఒజ్జ నిర్మించినదది. ఆచార్య ఎఱ్ఱయఒజ్జ ప్రసిద్ధ ఆంధ్రశిల్పి బ్రాహ్మణవంశమువాడు; సకలాగమశాస్త్రవేత్త, వేదవేదాంగ పారంగతుడు. ఆతని శిల్పికౌశలము అనుమకొండ రుద్రేశ్వరాలయంలో ఆకాశచుంబియయినది. ఆ ఎఱ్ఱయఒజ్జ తండ్రి కామయఒజ్జ ప్రోలమహారాజుకాలంలో శైవాలయాలు, జైనాలయాలు నిర్మించినాడు. కామయఒజ్జ తండ్రి రాణ్మహేంద్ర పురనివాసి. ఆతని పూర్వీకులు ద్రక్షారామ, భీమారామ, సోమారామ దేవాలయాలు నిర్మించారు. షట్సహస్ర దేశవాసి అయిన మహాచార్య భీమఒజ్జకు ఎఱ్ఱయఒజ్జ మేనల్లుడు.

ఎఱ్ఱయఒజ్జ ముఖమండపంలో నిర్మించిన ఎనిమిది స్తంభాలకు నాలుగు వైపుల ముప్పదిరెండు విధాల అలంకారశిల్పము విన్యసించినాడు. అంగుష్ఠ ప్రదేశంలో కేశసదృశమయిన శిల్పము చూపరకు హృదయస్పంద మగునట్లు అద్భుతముగా విన్యసించినాడు.

దేవీ గర్భాలయద్వార సౌందర్యము వర్ణించ నలవికానిది. ద్వారఫలకముపై దేవీనాట్యము విన్యసించెను. ద్వారమున ఎనిమిది ఫలకములలో ఒక ఫలకము లతాయుక్తము, ఆ లతల రెండువైపులా రెండురథాలు, పైన ఇంకొక వాద్య విశేష ఫలకము లతాఫలకమునుండి ఉబ్బెత్తుగా ముందుకు వచ్చింది. శంఖ కాహళ వేణువులు, నాదస్వరాది ముఖ్యవాద్యాలు, డమరుమర్దళ మృదంగాది చర్మవాద్యాలు, రావణహస్తాది తంత్రీవాద్యాలు అనేకులు వాయించుచు నాట్యం చేస్తున్నారు. ఆఫలకానికి ముందు మరల లతాఫలకము. ఆ లతా ఫలక మీవల ద్వారపాలక ఫలకము. ద్వారపాలక ఫలక మీవల భక్తఫలకము! మరల లతాఫలకము.

ఏకవీరాదేవి విగ్రహవిన్యాసంలో ఎఱ్ఱయఒజ్జ చూపిన శిల్పసౌందర్యము అలౌకికము. ఏకవీరావాహనమయిన సింహంలో ఎఱ్ఱయఒజ్జ బ్రహ్మదేవునే ఓడించినాడు.

ఎఱ్ఱయఒజ్జ పనితనం గమనిస్తూ పూజానంతరం రుద్రదేవి అన్నాంబికతో చర్చ సాగించింది.

రుద్ర: చెల్లీ, మా పెద్ద తాతగారి ఆస్థానశిల్పి ఎఱ్ఱయఒజ్జ ఈ ఏక వీరాదేవి గుడిని నిర్మించాడు. అనుమకొండ రుద్రేశ్వరమునూ ఆయనే నిర్మించాడు.