పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తమ చాళుక్యుడు

247

వాతనే లేచి ద్వారపాలకునికి తన ఉత్తమాశ్వాన్ని సిద్ధముచేయుమని ఆజ్ఞ యిచ్చి, తాను సర్వాయుధోపేతుడై ఆ అశ్వరాజమును చెంగున అధివసించి మొగలిచర్లాభి ముఖుడై ప్రయాణము సాగించెను.

3

కాకతీయ దేవాలయశిల్పము చాళుక్యశిల్పమున గొన్ని మార్పులు కల్పించినది. ఆంధ్ర శాతవాహనుల కాలములో గుహావాస్తు, స్తూపవాస్తులతోపాటు, దేవాలయవాస్తుకూడా వర్ధిల్లినది. ఆంధ్రులు బౌద్ధులుకాకమున్ను అనాదియగు శైవమత మవలంభించినారు. ఆర్యజాతియగు ఆంధ్రజాతి వేదధర్మాన్నీ అసురికమైన శైవధర్మాన్నీ సమన్వయముచేసి ఉత్తమధర్మపథ మొకటి సృష్టించెను. ఆంధ్రులు కాకతీయులకు రెండువేల సంవత్సరాలకు పూర్వమే గోదావరీ కృష్ణాతీర భూములన్నియు ఆక్రమించి ఈ ప్రదేశాలలో అదివరకే నివాసంచేసే రాక్షస జాతులను లోబరచుకొని వారిని తమకు దాసులను చేసికొనిరి.

ఆంధ్రులు తమతోపాటు తెచ్చిన దేవాలయశిల్పము అద్భుతమయినది. వారు గోడలు కట్టుటకు రాళ్ళను ఉపయోగించలేదు. వివిధ మృత్తికలను కలిపి, ఇటుకలుచేసి వానితో నాలుగైదు అంతస్థుల భవనాలు నిర్మించేవారు. అటుల ఇటుకలతోనే వారు దేవాలయాలు నిర్మించుకొనేవారు.

బౌద్ధయుగంలోను ఆంధ్రులు స్థూపాలు ఇటుకలతోనే నిర్మించిరి. విగ్రహాలకు, ద్వారాలకు, ఆయకస్తంభాలకు శిలలను ఉపయోగించెడివారు. కొండలు తొలిచి చైత్యాలుగా, విహారాలుగా, గుహలు నిర్మించేవారు! ఇక్ష్వాకుల కాలములో రాతిలో ప్రథమచైత్యగృహ నిర్మాణము జరిగెను. పల్లవులకాలములో ఒకేరాతితో చెక్కిన దేవాలయాలు నిర్మాణము చేసినారు. ఆంధ్రశిల్పులు చాళుక్యుల కాలము నాటికిగూడ పూర్వరీతినే దేవాలయాలు ఇటుకలతో, సున్నముతో కట్టుచు, మండపాలు, స్తంభాలు, విగ్రహాలు రాళ్ళతో నిర్మింపసాగిరి. రాను రాను చాళుక్య కాలపు టంతమున ఆంధ్రశిల్పులు ప్రతిభతో గర్భాలయ ముఖమండప మధ్యమండప వివాహమండపాలు శిలలతో నిర్మించి, శిఖరాలుమాత్ర మిటుకలతో నిర్మించిరి.

కాకతీయ చక్రవర్తుల కాలములో స్తంభశిల్పము, ద్వారశిల్పము ఇంకను అపూర్వకౌశలముతో ముందునకు సాగెను. దేవాలయశిఖరము గూడ చాళుక్యకాలపు రూపమునుండి, మార్పుపొందెను. చాళుక్యశైవము, సాధుశైవము, కాకతీయశైవము, వీరశైవము, వీరశైవశిల్పము వైష్ణవవ్యతిరేకముకాదు; జైన వ్యతిరేకము వీరశైవ శిల్పముతో వీరభద్ర నందికేశ్వర లింగమూర్తుల వికాసముచే నిండిపోయినది.