పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తమ చాళుక్యుడు

243

రుద్ర: తామందరు మా అభిప్రాయం వినండి. మనకు కోటలోనూ, చుట్టుప్రక్కలా ఉన్న సైన్యము నాలుగులక్షలు మాత్రమే. మహాదేవరాజు ఎనిమిది లక్షల సేనతో వస్తున్నాడు.

శివ: దారిలో అడ్డగించడం ఉత్తమం కాదంటారా?

ప్రసా: తెలుగువీరులు ఒక్కొక్కరు ఇరువదిమందిపెట్టు అని మహాప్రభువులకు మనవి చేసుకుంటున్నాను. నాకూ, చాళుక్య మహారాజులుంగారికీ వారిని ఎదుర్కొనే ఆజ్ఞ దయచేయండి.

బాప్పదేవుడు: మహాప్రభూ! నే నీమధ్య వీరభోజనం లేక పస్తులుంటున్నాను. నాకున్నూ సెలవు దయచేయ కోరుతున్నాను.

రుద్ర: తమకందరికీ మేము కృతజ్ఞులం. కాని, ఇప్పుడు ఏ ఒక్కరికి గాని, అందరికిగాని, కొందరికిగాని, మహాదేవరాజును ఎదుర్కొనే అనుమతి యివ్వలేము. ఒక వార్తకోసం ఎదురుచూస్తున్నాము. అది రాగానే మేము తమ అందరికి కర్తవ్యం విశదీకరించగలం.

అన్నాంబిక అప్పుడు చక్రవర్తిని తనవైపు చూడదని గ్రహించి, లేచి, వారికి నమస్కరించి, లోనికి వెళ్ళిపోయెను. ఆమె పదిక్షణికములలో తిరిగి ఒక కమ్మ చేతపుచ్చుకొని, లోనికివచ్చి అది చక్రవర్తికి ఇచ్చెను. పట్టువస్త్రము వలె మెత్తగా, పొడుగుగా ఉన్న మొగలిరేకుపై మషీవర్ణాలతో లిఖింపబడిన ఆ లేఖను చక్రవర్తి గొంకప్రభువును చదువ నియమించినారు.

గొంకప్రభువు ఆ కమ్మను సవినయంగా మోకాలిపై వంగి అందుకొని తన స్థానము చేరి నిలిచి చదువ నారంభించెను.

“మహారాజాధిరాజా, అష్టమ చక్రవర్తీ! నిన్నటిదినం అనగా శక సంవత్సర 1182 రక్తాక్షి సంవత్సర జ్యేష్ఠ బహుళ పాడ్యమి బుధవారంనాడు రాత్రి మహాదేవరాజు గోదావరీతీరంలో దండువిడిసి ఉండగా గోన గన్నారెడ్డి అనే ఒక గజదొంగ ఏబదివేల సైన్యంతో విరుచుకుపడి మహాదేవరాజు సైన్యాలను డెబ్బదివేలవరకూ హతమార్చి, మహాదేవరాజు సంసిద్ధుడయ్యేలోపునే సైన్యంతో మాయమైపోయినాడు. అతన్ని వెంబడించి నాశనం చేయవలసినదిగా రెండులక్షల సైన్యాన్ని మహాదేవరాజు వాండ్లవెనుక పంపించినవా డాయెను. ఇది మమ్మేలిన వారికి మనవిచేస్తూ మహా ప్రభువుల సేవకుడు మిరియాల ముమ్మరాజు.”

ప్రసాదాదిత్య ప్రభువు శివదేవయ్య దేశికులవంక చూచి, “గురుదేవా! గోన గన్నారెడ్డి మనం చేయవలసిన పనిని మనకోసం చేసిపెడుతున్నాడు! ఇది విచిత్రమే!” అని మనవి చేసెను.

శివ: వీరభద్రమహారాజా! తమ అభిప్రాయం సెలవియ్యండి.

వీర: గన్నారెడ్డి ప్రభువు చాలా ఉత్తమకార్యం చేశారు. అంతకొద్ది సైన్యంతో ఆరితేరిన ఉత్తమనాయకునిలా యుద్ధం నడిపారు.