పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

240

గోన గన్నా రెడ్డి

గన్నారెడ్డి ప్రభువు హృదయము చాల గుప్తమగుట యేలనో? ఆయన హృదయము నవనీతము. శత్రువును నాశనము చేయుటలో ఎంత దుర్నిరీక్ష్య తేజోవంతు లాయన కాగలరో, యుద్ధేతరకాలంలో అంత సుకుమార చరిత్రులు అయిపోతారు. యుద్ధములో దెబ్బతిన్న శత్రువులకుకూడా తల్లి వలె ఆయన వైద్యము చేయించును. గ్రామాలజోలికి, పశువులజోలికి వెళ్ళనే వెళ్ళడు. ఇట్టివాడు గజదొంగయా?

తన కీ సమస్య కృష్ణవేణీదేవియే ఒకనాడు విడదీయవలసి ఉండును. ఓహో కృష్ణవేణి అంటే గన్నారెడ్డి ప్రభువుకు ఎంతప్రేమ! ఒకవేళ ఆ దేవి ఆయన మనస్సు పూర్తిగా చూరగొన్నదేమో?

ఇంతలో విశాలాక్షప్రభువు స్నేహితుడు ఆ ప్రక్క మందిరంలో పండుకొన్నవాడు లేచివచ్చి, ‘ప్రభూ! నిద్రపట్టలేదా తమకు? మంచినిద్దురలో ఉన్న నాకు మెలకువ వచ్చి, మీరు మేలుకొని ఉండుట చూచి లేచివచ్చాను.’

విశా: అవును మల్లికా! ఈలా పురుషవేషాలతో ఆ తల్లి విశాలాక్షి మీదే భారంవైచి వచ్చాము.

మల్లి: నిదురలోనున్నా మనం ఏమరుపాటుగా ఉండకూడదనుకుంటే మీరు తేలిపోతున్నారేమి అమ్మా?

విశా: దినదినమూ వారితో ఉండి, ఆ మహాపురుషుని చరిత్ర గమనిస్తూ నే పడే వేదన అణచుకుంటూ, పైకి పురుషునివలె నటించడం దుర్భరమే అవుతూ ఉంది మల్లికా!

మల్లిక: రాజకుమారీ! ఏంచేద్దాము? వెళ్ళిపోదామా? అయినా, మనం వచ్చిన పవిత్రదీక్షా విజయం పొందకుండా వెళ్ళిపోతే తలవంపుకాదా?

విశా: మల్లికా! నీ కది పవిత్రదీక్షయేమో, నాకుమాత్రం ఇదంతా స్వలాభపూరితమైన పనికాదా అనిపిస్తున్నది.

మల్లిక: మీరది ఏమనుకున్నాసరే. మనం వేసిన వేషాలు కట్టుదిట్టంగా ఉన్నాయి. అందుచేతనే గన్నారెడ్డిప్రభువు మిమ్ము ఆనవాలు పట్టలేకపోయారు. వచ్చినందుకు ఈ మధ్యను జరిగిన గజయుద్ధంలో పాల్గొన్నాము. తాము రెండు సారులు గన్నారెడ్డిప్రభువు ప్రాణం రక్షించారు.

విశా: అదే మరింత కష్టంగా ఉంది మల్లికా! ఒకవేళ నేను ఎవరో ఆ మహాపురుషుడు గుర్తించి కృతజ్ఞతతో నన్ను ఉద్వాహం చేసుకుంటానని అనవచ్చు. వ్రతనియమం పాలనచేయలేనివాడు వివాహమే చేసుకొనకపోవచ్చు.

మల్లిక: ఏమి అనుమానాలండీ మీవి?

విశా: వచ్చాము, ఇంతవరకూ గౌరవంగా బయటపడ్డాము. ఇంక ఈ విషయంలో గజిబిజిలు రాకుండా చల్లగా రుద్రదేవి సామ్రాజ్ఞికడకే వెళ్ళిపోదాము.