పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణవేణి

239

భోజనశాల వేరు, స్నానశాలలు వేరు. విశాలాక్షప్రభువు విడిగా కృష్ణలో ఎక్కడో స్నానంచేసి వచ్చేవాడు.

మువ్వురూ కలిసి భోజనాలుచేసి ఆ సైకతాలలో కొంతకాలము కూర్చుండి మాట్లాడుకొన్నారు. గన్నారెడ్డికి ఉద్భవించిన ఆవేదన ఇట్టిదని ఆయనే నిర్ణయించుకోలేకపోయినాడు. మంచముపై మేనువాల్చి, ఎంతకూ నిద్దురపట్టక లేచి కూర్చుండినాడు. పక్కపై మేనువాల్చిన మరునిమేషాన గాఢనిద్రబోయే తాను నేడు నిద్దుర పట్టక ఇలా రాత్రించరుడగుటకు కారణము రేపు రాబోయే మహాదేవరాజు జైత్రయాత్రవల్లనా?

అతడు రావచ్చును కాని తిరిగి వెళ్ళుట ఆతనికి వశమా? ఇంక ఎవరో మహారాజద్రోహి ఒక డున్నాడు తమకు ఒకనిపై చాల అనుమానమున్నది. నిశిత బుద్ధికల అపసర్పులను నిజము కనిపెట్టుడని తాను పంపించాడు. తన అనుమానము నిజమయితే, కర్తవ్యము వెంటనే తనవారందరితో ఆలోచించి తగిన ప్రతీకారము సలుపవలసియుండును.

ఈ బాలుడెవ్వడో ఉత్తముడు. కాని తన జీవితములో ఏదో దాచుచున్నాడేమో? నుడికారము చూడగా ఈతడు ఈ చుట్టుప్రక్కలవాడేనని స్పష్టము. కొఱవిదేశంనుంచి, సబ్బిసాహిరమండలంనుంచి వచ్చినట్లు నమ్ముటకు వీలులేదు. ఇంతలో గోన గన్నారెడ్డి ప్రభువు నిద్దురకూరినాడు.

15

తన మందిరములో విశాలాక్షిరెడ్డి నిద్దురపట్టక చాలసేపు మేలుకొని ఆలోచించుకొనుచు కూరుచున్నాడు. గన్నారెడ్డి ప్రభువు తన హృదయములో ప్రేమ లేదందురేమి? మనుష్యుని జీవితం ప్రేమ లేకుండ ఉండగలదా? ప్రేమలేని మనుష్యుడు మనుష్యుడా? ప్రేమగలవాడు మనుష్యుడు కావచ్చును. ప్రేమకు వ్యతిరేకమైన ద్వేషముకలవాడును మనుష్యుడు కావచ్చును. కాని ఈ రెండునూ లేనివారు లోకాతీతులై ఉండవలె. లేక ప్రేమ ఎరుగని జంతు స్వరూపులు కావాలి!

గన్నారెడ్డి ప్రభుని ప్రేమను చూరగొనగల బాలిక ఉదయించలేదు కాబోలు! అందులో ఈ ఉన్నతవంశాలలో సాధారణంగా ప్రేమకు తావులేదు. రాజకీయావసరాలకు వివాహాలు జరుగుతాయి. ఆ దాంపత్యములో భార్యాభర్తలు బిడ్డలగనుచు స్నేహితులౌతారు. స్నేహితులుకాకుండ విరోధులయ్యే భార్యాభర్తలు ఉన్నారు. ఒక్కొక్కప్పుడు స్నేహము ఉత్తమ ప్రేమగా మారిపోతుంది.

రుద్రదేవ చక్రవర్తిని శ్రీ చాళుక్య వీరభద్ర మహారాజును గాఢముగా ప్రేమించుచున్నారు. వారిరువురకు వివాహమయినచో మహోత్తమ ప్రేమగల దంపతులు లోకానికి ప్రత్యక్షమగుదురుగదా!