పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

238

గోన గన్నా రెడ్డి

విశా: పశువులలో స్త్రీ పురుషాకర్షణ జంతుధర్మం. మనస్సు కలిగిన మనుష్యుడు ఆ జంతుధర్మాన్ని దివ్యధర్మం చేసినాడు. దానినే ప్రేమ అంటాము.

గోన: జాగ్రత్తగా ఆలోచించి ఒక ధర్మం నిర్ణయించినట్లా?

విశా: అదికాదు ప్రభూ! పశువులలో తల్లిబిడ్డల ప్రేమ, బిడ్డల చిన్నతనం వరకే! ఆ పైన ప్రేమలేదు. ఆ భావమే ఉండదు. బిడ్డ తల్లికి భర్త కావచ్చును.

గోన: కావచ్చు నేమిటి? అవుతున్నాయి!

విశా: జంతువులలో సహోదరప్రేమ లేనేలేదు!

గోన: సరే, ఇంక నీ వనేది మానవులలో మాతృప్రేమ, సోదరప్రేమా ఉన్నట్లు స్త్రీ పురుష ప్రేమా ఉందని. ముసలివార లైన స్త్రీపురుషులకు దాంపత్య ప్రేమ ఎట్లా సాధ్యమవుతుంది?

విశా: మహాప్రభూ! స్త్రీపురుష ప్రేమ సర్వకాలమూ దాంపత్య ప్రేమగా ఉండాలనేదిలేదు.

గోన: ఓయి యువకనాయకుడా! ఇంత చిన్నతనంలోనే ఇంత విచిత్రభావాలు నీ కేల్లా అలవడినాయి?

విశా: మహాప్రభూ! ప్రచండ విషయాలు గమనించడానికి ఈడుకూడా అడ్డంరాదు ఒకప్పుడు.

గోన: జ్ఞానమౌక్తికాలు ఒలికిస్తున్నావు విశాలప్రభూ! నువ్వు నా మనస్సును దొంగిలించినావు. గజదొంగకే దొంగవయినావు!

విశా: (చిరునవ్వు నవ్వుతూ) మహారాజా! మీ వస్తువు లెవ్వరు దొంగతనం చేయగలరు?

గోన: ఈ వేసవికాలం పూర్తికాకుండా ఆంధ్ర సామ్రాజ్యాన్ని దొంగతనం చేయడానికి దేవగిరి యాదవుడు వస్తున్నాడు. మన సైన్యాలన్నీ చెల్లచెదరై ఉన్నాయి. ఇంక పదిహేనురోజులలో మళ్ళీ సైన్యాలన్నీ చేర్చవలసి ఉంటుంది. సరేకాని విశాలాక్షనాయక అనేపేరు మీకు ఎలా వచ్చిందయా? మీ తండ్రిగారు కాశీ వెళ్ళారా?

విశా: అవును మహారాజా! మా తాతగారు కాశీ వెళ్ళారట. అక్కడ నుంచి వచ్చిన నెలరోజులకు నేనుపుట్టితినట.

గోన: బాగుంది. చీకటిపడింది. మనవారిని కాగడాలు వెలిగించమనండి. నెగళ్ళుచేసి మన శిబిరంచుట్టూ అప్రమత్తులుగా ఉండమనండి. మనం భోజనానికి వెడదాం.

కృష్ణఒడ్డునే ఒక ఇసుకతిప్పపై గోన గన్నారెడ్డికి, విశాలాక్షప్రభువుకు మల్లికార్జున నాయకునకు విడివిడిగా పటకుటీరలు నిర్మించారు. ఆ ప్రక్కనే వంటకుటీరా లున్నాయి. దూరంగా సైనికుల కుటీరాలు నిర్మించినారు,