పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణవేణి

229

రాంతకం పట్టుకొని, అక్కడ శాసనం వేయించాడు. మళ్ళీ ఇప్పుడు ఇంకా ఎక్కువ ధైర్యం వహించి, పదివేల ఏనుగులతో, లక్ష ఏబదివేల కాల్బలంతో వచ్చాడట. రెండువేల ఆశ్వికులట, వేయి రథాలట, పదివేల ఏనుగులలో చేర భూపతివీ, గాంగులవీకూడా ఉన్నాయట. ఈ ఏనుగులబలం ముందు నడిపించుకుంటూ, తిరుగులేకుండా త్రిపురాంతకం పట్టుకున్నాడట.

“కృష్ణకు దక్షిణాన్ని ఉన్న సిందవాడి, మార్జవాడి ఆక్రమించాడట. పొత్తపినాడు ఆక్రమించి పురందలూరు పట్టుకున్నాడట. అంబయదేవ త్రిపురాంతకులు సైన్యాలతో పారిపోయి జన్నిగదేవుని కలిస్తే ఆయన కూడా సైన్యాలతో ఆ ఏనుగులముందు మనమేమి చేయగలము అని వెలనాటికి వచ్చేశారట. ఏరువనాడు రాజేంద్రచోడుని హస్తగతం మొదటే అయింది. అతనితో ఏరువనాటి చిన్న సామంతులు, తొండై మండలం చిన్న సామంతులు అనేకులు కలిశారట. ఈలా కలిసిన సైన్యాలు డెబ్బదివేల కాల్బలము, రెండువేలమంది అశ్వికులు, వేయి ఏనుగులు, అయిదువందలమంది రథికులూనట. సంగమేశ్వరానికి దిగువ ఎక్కడో కృష్ణానదినిదాటి ఓరుగల్లు పట్టుకుంటారట!

“వీర ప్రభువులూ, యువకులూ, లవకుశ సమానులు, కుమారస్వాములూ వీరభద్రులూ అయిన తమరు, ఇంతవరకు ఓటమి ఎరుంగని తమరు శ్రీ గోన గన్నారెడ్డి ప్రభువు నాయకత్వాన ఈ ఉప్పెనను అరికట్టవలసి ఉంది” అని గంభీర వచనాలతో మనవిచేసి తన ఆసనం అధివసించాడు.

అప్పు డొక పండితబాలుడు (విద్యానాధుని తండ్రి) లేచి,

“త్రిపురసంహారకమైన శివుని మూడవ నేత్రము మీయందు నిలుచుగాక!

“దక్షగర్వాపహారి వీరభద్రుని అఖండ విక్రమము మీ బాహువులయందు నిలుచుగాక!

“తారకాసురసంహారి కుమారస్వామి ఉద్దండ పరాక్రమము మీ హృదయాల యందు నిలుచుగాక!

“గోన గన్నారెడ్డి చోళగజాసురుల చెండాడు దివ్యగజాననావతారుడగు గాక!” అని చేయెత్తి ఆశీర్వదించెను.

11

రాజేంద్రచోడుడు అడ్డులేని పురోగమనంతో చొరబారివచ్చుచున్నాడు. ఆంధ్ర కమలాకరములో చోళహస్తి చొరబడి తామరపూవుల, ఆకుల, తూండ్ల చిందరవందర చేస్తున్నది.

ఉద్ధురగమనములు, పర్వతసమానములు, కుపితములు, నిర్భీకములు అగు గజతండములు యిత్తడి మొనలు తాపడంచేసిన నిశితదంతాగ్రములతో, ముఖ ఫలకములతో, ఆ ఫలకములందు కొండల బద్దలుకొట్టగల నిశితములైన