పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

226

గోన గన్నా రెడ్డి

ఆ బాలుని నవ్వు ఆతని హృదయాన్ని కలవరపరచినది. అది నవ్వా, గాంధర్వమా? కోయిలలు కువకువ కూసినవా? లేక బంగారుమువ్వలు మ్రోగినవా? కిన్నెరతంత్రులు మీటినారా? వేణుస్వనాలు విననయినవా? గన్నారెడ్డి ఆ బాలుని మోము తేరిపారజూచినాడు.

పుట్టిని ఒడ్డుకుబట్టి గన్నారెడ్డి రెండుసార్లు కోకిలలా, ‘కూ! కూ! కో! కో!’ అని కూసినాడు. మళ్ళీ రెండుసార్లు కోకిలకూత వినబడింది. ఆ వెంటనే నలుగురు భటు లక్కడికి వచ్చిరి.

వెంటనే గన్నారెడ్డి ఒడ్డుకు ఉరికి, వీరిద్దరినీ చేతులందించి ఒడ్డుకు దింపి, తాను బాలునీ, వచ్చిన వీరులలో ఒకరు బాలుని అనుచరునీ పట్టుకొని నడిపించికొనిపోవ నారంభించినారు.

అడుగడుగుకు ఆ అడవిలో, గుట్టలలో, రాళ్ళలో, చిన్న లోయలలో, కోకిల కూతలు రెండుసార్లు చొప్పున విన బడుతూనే ఉన్నాయి.

ఎప్పటికప్పుడు వారు నడిచే దారి అంతమైనట్లే కనిపిస్తుంది మరల ఒక రాయి తిరిగితే, ఒక పొద మళ్ళితే, ఒక లోయ దాటితే, మరో క్రొత్తదారి.

అలా నడిచి నడిచి, జామున్నర ప్రొద్దు ఎక్కేసరికి, వారు కొండ శిఖరం చేరారు. అక్కడినుండి, వారు ఆ కొండ శిఖరమునుండి ఒత్తయిన చెట్లలో, గుట్టలలో, రాళ్ళలో ప్రయాణం చేశారు. ఇంతలో ఒక చెట్లగుంపు దాటగానే ఎట్టఎదుట ఒక మహానగరం ప్రత్యక్షం అయింది. గోన గన్నారెడ్డి అక్కడ వారి గంతలు విప్పాడు.

ఆ బాలుడూ, ఆతని స్నేహితుడూ కళ్ళు చిట్లించుకొంటూ ఆశ్చర్యముతో ఆ నగరం చూచారు. కొంతకాలంవరకూ వారి చూపులు నల్లపడి, పచ్చపడి చివరకు స్పష్టత తాల్చాయి. ఆ నగరం అందం, ఆ నగరం కోటగోడలు, ద్వారాలు, కందకము వారు చూచారు. చుట్టూఉన్న ఎత్తయిన కొండలూ, ఆ కొండలు నిండి ఉన్న అడవులు చూచారు.

గన్నారెడ్డితో వచ్చిన వీరుడు వీపున తగిలించిన కొమ్ము నొత్తగానే ఆ కోట ద్వారం తలుపులు విడి కందకంమీద వంతెన వాలింది. వారంద రావంతెన దాటి నగరంలోకి పోయినారు.

వారందరు ఆశ్వారూఢులై నగరంమధ్యనున్న కోటగోడలదగ్గరకు చేరిరి. రథికులు, ఆశ్వికులు, పదాతులు, వర్తకులు, సేవకులు - ఎదురై నవారందరు తన్ను తీసుకొనివచ్చిన వీరునకు నమస్కారం జేయడం చూచి, ఆబాలుని ఆనందం వర్ణనాతీతమైనది.

కోటలోనికిపోయి మహారాజభవనప్రాంగణంకడ వారందరు అశ్వాలను అవరోహించి, అక్కడ ఉన్న భటులు గుర్రాలను స్వాధీనంచేసుకోగా, సభామందిరం ప్రవేశించాడు. వెంటనే అక్కడ వివిధాసనాల అధివసించిన యువక వీరు