పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణవేణి

225

“మారాజ్యమా? మాది చౌడమహారాజ్యపు సరిహద్దున, ఒక చిన్న రాజ్యం. మాది చక్రకోట్య దేశంలోనిది; నేను ధారావర్షులకు దూరపు చుట్టమైన రాజకుమారుణ్ణి.”

“అంతదూరమునుంచి మా సైన్యములో చేరడానికి వచ్చారా?”

“చిత్తం స్వామీ! మీ నాయకుని పక్కనఉండి యుద్ధం చేయాలని కోర్కె. ఇంటికడ ఒక లేఖ వ్రాసిపెట్టి బయలుదేరివచ్చాను.”

“ముట్టుకుంటే కందిపోయే రీతిగా ఉంది మీ దేహం!”

“ఇది రెండసారి తాము ఆముక్క అనడం. ఇప్పుడేకదా నాబలం కళ్ళారా చూచారు. మన శిబిరానికి వెళ్ళినతరువాత నా బలం మీకు చూపిస్తాను.”

“మంచిది.”

“తమ పేరు ఎవరో?”

“నా పేరు ఎవ్వరూ ఉచ్చరించరానిది!”

“అదేమిటి అట్లాంటారు?”

“నేను చేసిన పాపాలు అనంతం. నేను హీనుణ్ణి. మా ప్రభువే హీనుడు....”

“స్వామీ, మీరు గన్నారెడ్డి మహారాజునే అంటూ ఉన్నట్లయితే, ఆ మాటలు రానీయకండి.”

“అదేమిటి రాజకుమారా?”

“నాకు శ్రీ గోన గన్నారెడ్డి ప్రభువంటే భగవంతుని అవతారమని ఊహ. నా భగవంతుని నా ఎదుట ఎవ్వరూ తూలనాడటానికి వీలులేదు.”

“కాలుదువ్వి కజ్జా తెచ్చుకుంటావేమయ్యా ప్రభూ.”

“నేనా కాలుదువ్వుతా? ధర్మమైనదీ, నా హృదయానికి అతి సన్నిహితమైనదీ ఒక విషయం మనవిచేశాను. ద్వంద్వయుద్ధంవలన మనలోని అమరజ్యోతికి కళంకం రాదు, పొగచూరదు. కాబట్టి సంతోషంగా మీతో సమస్త ఆయుధాలతో ద్వంద్వయుద్ధము చేస్తాను.”

“నావల్ల మీరు ఒక వేళ ఓడిపోతే?”

బాలుడు: స్వామీ! అలా ఓడిపోతే మీవంటి ఉత్తమ వీరునివల్ల ఓడిపోయి నందుకు నాకు కించలేదు. మీవల్ల విద్య నేర్చుకున్నట్లవుతుంది.

గోన: నేను ఉత్తమ వీరుణ్ణని ఎలా తెలిసిందయ్యా?

బాలుడు: మామిడిపండును చూచి, ఇది మామిడిపండు అని తెలుసుకోవడం కష్టమా!

గోన: నేను మీవల్ల ఓడిపోతే?

బాలుడు: (పక పక నవ్వుతూ) నావల్ల.... మీరా ఓడేది? ఓహో!