పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

224

గోన గన్నా రెడ్డి

బాలు: అలాగే? అదిగో కృష్ణ ఆవలిఒడ్డున అ చెట్టు చూచారా? మామిడిచెట్టు, ఆ చెట్టుక్రింద క్రొమ్మకు క్రిందుగా వేలాడే మామిడిపండు చూచారా? ఆ పండు పడకుండా, ఈ బాణం దానికి గుచ్చుకుంటంది. చూడండి, అనుచు ఆ బాలుడు చెలికా డందిచ్చిన ధనుస్సు అంబులపొది అందుకొని, ఆ పొది తగిలించుకొని వక్షానికి బిగించుకొని, ధనుస్సు ఎక్కుపెట్టి, బాణంతీసి గురిచూచి వదిలాడు. రివ్వున ఆ బాణంపోయి, ఆ మామిడికాయకు తగుల్కొన్నది.

గోన గన్నారెడ్డి ‘ఓహో’ అన్నాడు. వెంటనే ఆ బాలకుడు చెలికా డందిచ్చిన మామిడికాయ నొకదానిని పై కెగురవేసి కత్తి ఝళిపించి పైనుండి క్రిందికి తిప్పినాడు. ఆ లేత మామిడికాయ రెండు సమానపు చెక్కలై క్రిందకు పడింది.

“ఇప్పుడైనా నన్ను చేర్చుకోరా మీ ప్రభువు?” అని బాలుడు ఎక్కువ ఆతురతగా అడిగాడు.

గోన: బాగుందయ్యా! నేను మాట ఇస్తానుగాని కన్నులకు గంతలు కట్టి తీసుకుపోతాను.

బాలు: మంచిది.

గోన గన్నారెడ్డి గొంతుఎత్తి ‘ఓహోహో’ అని అరచెను. పదిమంది మనుష్యులు అక్కడకు పరుగునవచ్చారు. వారందరు గన్నారెడ్డికి నమస్కరించారు.

గోన: చిన్న పుట్టితియ్యండి, నేనేస్వయంగా నడుపుకొని వీరిని తీసుకు వెడతాను.

‘చిత్త’ మని అందులో ఒకవీరుడు నీటికడ ఉన్న రాళ్ళలో ఒకరాళ్ళ గుంపు కడ వంగి తీగలుతీసి, ఒక చిన్న పుట్టిని ఈవలకు లాగినాడు. అందులో గన్నారెడ్డి, ఆ బాలుడూ, అతని మంత్రి అధివసించినారు. గన్నారెడ్డి ఆబాలు డందిచ్చిన రుమాలును అతనికళ్ళకు, చెలికా డందిచ్చిన రుమాలును చెలికాని కళ్ళకు కట్టి బిగించి పుట్టి నడుపుకొంటూ నదిలోకి పోయినాడు.

9

ఆ యువకప్రభువు కండ్లకు గంతలు కట్టుచున్నపుడు గన్నారెడ్డికి ఒళ్ళు ఝల్లుమన్నది. ఆ బాలునిమోము ఎక్కడో చూచినట్లున్నది. మీసాలులేవు. శిరస్త్రాణం నుదుటి నంటి ఉండడంచేత పోలిక అంతుపట్టడానికి వీలులేకుండా ఉంది.

“ఓ బాలప్రభూ! మీ రాజ్యం ఎక్కడ?”