పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణవేణి

223

రాల ఈడుగల ఒక బాలుడు, కవచ శిరస్త్రాణాదులు ధరించి నడుమున కరవాలముతో వీపున డాలుతో గుఱ్ఱాన్ని నడుపుకొంటూ ఆ రాళ్ళలో నెమ్మదిగా దారి చూచుకుంటూ వస్తున్నాడు. అతని వెనుక ఇంకొక్క యువకుడు ఇరవై ఏళ్ళ ఈడుగలవాడు అంగరక్షకుడు కాబోలు తనగుఱ్ఱాన్ని నడిపించుకొంటూ వస్తున్నాడు.

గోన: ఎవరు కావాలి మీకు?

బాలుడు: నాకు శ్రీ గోన గన్నారెడ్డి ప్రభువర్యుల దర్శనం కావాలి. చూస్తే బాలుడు, గొంతు బాలికాకంఠం! అలాంటి బాలకులను గన్నారెడ్డి ఎరుగును. యవ్వనము వచ్చేముందు చాలమంది బాలురకు స్త్రీ కంఠమే ఉంటుంది.

గోన: ఏమిపని వారితో?

బాలు: నేను వారి కొలువులో చేరడానికి వచ్చాను.

గోన: వారికి రాజ్యంలేదే.

బాలు: స్వామీ! మీరుకూడా వారి సైన్యంలో ఉన్న వారిలా కనబడుతున్నారు. వారి రహస్యనగరానికి దారిచెప్పండి.

గోన: ఓయి వెఱ్ఱివాడా! నా మొగముచూస్తే నేను గన్నారెడ్డి జట్టులో వాడనని తోచిందా? లేక నీకు తెలిసే మాట్లాడుతున్నావా?

బాలు: స్వామీ! ఈ చుట్టుప్రక్కల నెక్కడనో వారికోట ఉందని వినికిడి. వారి సైన్యంలో చేరాలని ఎన్నాళ్ళనుండో నాకు కోరిక. ఇంటిదగ్గర చెప్పకుండా పారిపోయి వచ్చాను.

గోన: నీవు ఇంత చిన్నతనంలో వస్తే, ఆయన నీ తల్లి దండ్రుల అనుమతి లేనిదే సైన్యంలో చేర్చుకోడే.

బాలు: వారికి ఎవరు అనుమతి ఇచ్చారు? వారిలోచేరిన యువకవీరులందరికీ వారి తలిదండ్రులు అనుమతి ఇచ్చారా?

గోన: బాగుందయ్యా! నీ పేరు?

బాలు: నా పేరెందుకు స్వామీ?

గోన: మరి మా సేనలో చేరేవారి పేరు మా కక్కరలేదా?

బాలు: అలాగే! నా పేరు విశాలరెడ్డి.

గోన: మీ ఇంటి పేరు?

బాలు: మా యింటిపేరు అనుమకొండవారు.

గోన: ఆ అబ్బాయి?

బాలు: ఆ అబ్బాయి నా మంత్రి.

గోన: నీకు ముక్కుపచ్చలన్నా ఆరలేదు. నువ్వు గన్నారెడ్డి సైన్యంలో ఏం చేయగలవయ్యా రెడ్డివర్యా?