పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

220

గోన గన్నా రెడ్డి

ఏదో రహస్యము నాతో చెప్పదలచుకున్నది. నువ్వుమాత్రం తొందరపడి రాకు. అవసరమైతే నేనే వార్త పంపుతాను” అని అక్కినతోచెప్పి, మాచనమంత్రివద్ద సెలవుతీసుకొని పెదఅక్కినప్రగడ కడకు వెళ్ళినాడు.

గోన: తాతగారూ! నమస్కారాలు, నేను సెలవుతీసుకొని వెళ్ళివస్తాను.

పెదఅక్కిన మంత్రి: దొంగవాళ్ళకూ, మాకూ ఏమీ సంబంధంలేదు. అవసరంలేదు, వారు మాదగ్గర సెలవుతీసుకొనే, మేము ఇవ్వవలసిన అవసరంలేదు.

గోన: అక్కినమంత్రిగారూ! మీ కోపము మా కాశీర్వాదము. త్వరలోనే దర్శనము వాంఛిస్తాను.

పెద: నేను మీ మంత్రి చినఅక్కినప్రగడను, నాపేరు పాడుచేయడానికి పుట్టినవాణ్ణి, మా వంశానికి అపఖ్యాతి తెచ్చేందుకు పెరిగినవాణ్ణి, ఇప్పుడే బందీ చేసి ఓరుగల్లు తీసుకొని వెడుతున్నాను.

గోన: తాతగారూ, బందీచేసి తీసుకొని వెళ్ళగలరా?

పెద: నేను ప్రసాదాదిత్యప్రభువునడిగి వేయిమంది వీరుల్ని తీసుకొని వచ్చాను.

గోన: ఈ గ్రామంచుట్టూ నా సైన్యాలు పదివేలు సిద్ధంగా ఉన్నాయి.

పెద: మిమ్మూ చక్రవర్తి పేరుచెప్పి బందీచేస్తున్నాను.

గోన: (పకపక నవ్వుతూ) తాతగారూ! మీ ధర్మబుద్ది ప్రశంసనీయం. కాని మమ్ము బందీచేయగలవా రొక్కరే ఉన్నారు. చక్రవర్తే స్వయంగా నన్ను బందీచేశానంటే లోబడగలను. లేకపోతే హరిహర బ్రహ్మలు అడ్డంవచ్చినా గోనగన్నారెడ్డి పీల్చివదలే గాలినైనా స్పృశించలేరు.

పెద: అంత విఱ్ఱవీగటం ఎవరికీ తగదు.

గోన: తాతగారూ! మీ మాటలు నాకు నవ్వుకలుగజేస్తున్నవి. మీఅక్కిన మీతో వస్తాడు. అక్కడ మూడునాళ్ళుంటాడు. ఆ తర్వాత శ్రీశ్రీ రుద్రదేవ సార్వభౌములు స్వయంగా ఆజ్ఞఇస్తే తప్ప ఏశక్తీ అతన్ని అక్కడ ఆపలేదు. సెలవు.

గోన గన్నారెడ్డి నవ్వుతూనే నెమ్మదిగా నడిచి, సింహద్వారంకడకువెళ్ళి, అక్కడ తనకై సూతుడు సిద్ధంగా ఉంచిన ఉత్తమాశ్వం ఎక్కి వెళ్ళిపోయినాడు. పెదఅక్కినప్రగడ మరుమాటలేక నిలిచిపోయెను.

అక్కినను బందీగా తీసుకొని వెళుతున్నారు అన్న ప్రతీతి ఆ గ్రామం అంతా పాకింది. కామేశ్వరి భర్తను కలుసుకున్నది.

కామే: మీరు ఓరుగల్లుకు బందీగా వెడుతున్నారట కాదా?

అక్కి: అవును నారాణీ!