పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

216

గోన గన్నా రెడ్డి

“ఏమయ్యా చోడోదయా, ఉదయచోడ మహారాజుకు మనుమడవు. ఉదయచోడుడు రుద్రచక్రవర్తికి లోబడిన నాటినుండి, మీతండ్రి గోకర్ణ చోడుడు శ్రీ కాకతీయవంశానికి భక్తితో సేవచేస్తూ ఉంటే, నీకు ఈ దుర్బుద్ధి పుట్టిందేమి? నువ్వు పదివేలసైన్యంమాత్రం ఉంచుకో, తక్కిన సైన్యం మా దగ్గర ఉంటుంది. ఖర్చు నీవే భరించాలి. నీ గుఱ్ఱాలన్నీ మావి, నీ పట్టుసూత్రము, నీ అశ్వము మావి, నీకిష్టమైతే ఇవి ఒప్పుకొని మాకూ, చక్రవర్తికీ సామంతుడుగా ఉండు. లేదా, దేశాలు విడిచి కాశీయాత్ర చేసుకో” అని చెప్పెను.

చోడోదయుడు తలవాల్చుకున్నాడు. ఆతని హృదయంలో ప్రళయం నాట్యం చేస్తున్నది. ఈ గజదొంగ చేతిలో పాలువిరిగినట్లు తనవిధి విరిగిపోయినది. ఈతనికింత అదృష్టము ఎలాపట్టినది? ఈతడు ఇంతటి వీరు డవడమేమిటి? చోడోదయుని హృదయం దహించుకుపోతున్నది. పైకి నవ్వు మొహంతో,

చోడో: మహారాజా? నేను శ్రీరామునివంటి మహావీరునిచేతిలో ఓడిపోయాను.

గోన: చోడోదయరాజా! మీరు నన్ను భట్రాజులా పొగడనవసరంలేదు. మనం ఆంధ్ర క్షత్రియ వంశాల్లో ఉద్భవించాము. మనకు ధర్మము, అధర్మమూ అవసరంలేదు. రాబందుల్లా ఒకళ్ళనొకళ్ళం పీక్కుతింటాము.

చోడో: మహారాజులకు కోపంవద్దు. నేను చేసినతప్పు నేను గ్రహిస్తున్నాను. ఆంధ్రచోడులూ ఒకనాడు చక్రవర్తులు...

గోన: అంతకుముందు చాళుక్యులు, అంతకుముందు పల్లవులు, అంతకుముందు ఇక్ష్వాకులు.... వెళ్ళిపోయిన చక్రవర్తివంశంవారు, మళ్ళీ చక్రవర్తులవటం కాలధర్మం కాదుప్రభూ!

చోడో: అదే నేను మనవిచేసేది. కాని పొరపాటుపడి ప్రయత్నాలు చేయడంమానవస్వభావం, క్షాంతవ్యుణ్ణి; తాము చక్రవర్తి కాదగిన మహానుభావులు.

గోన: కరటక దమనకులనీతి నేర్చుకుంటున్నారా?

చోడోదయుడు పెదవి కొరుక్కున్నాడు. కళ్ళలోమంటలు లేచాయి. వెంటనే చప్పబడ్డాయి.

గోన: చోడోదయప్రభూ! నేను గజదొంగను నా నీతి నాది. దాదికి వీసం తప్పను. భగవత్స్వరూపిణి శ్రీ శ్రీ శ్రీ రుద్రమదేవి నాకు చక్రవర్తిని. అందుకు ఇంద్రుడు కాదన్నా అతన్ని హతమారుస్తాను. ఇకచాలు . విఠలప్రభూ! చోడోదయుని తురంగాలన్నీ మనవి. చోడోదయుని తురంగము మీది, ఆ తురంగసూత్రము మా అశ్వానికి తగిలించవలసిందిగా సూతునికి ఆజ్ఞ ఇవ్వండి. చోడోదయుని బందిగా వదలి ఆయన సైన్యాలు మన సైన్యంలో చేరేవి చేర్పించండి. తక్కిన