పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణవేణి

215

గన్నారెడ్డి ఆశ్వికసైన్యాన్ని పొదుపుకొని ముప్పది వేలమంది పదాతులను నడుపుకొని విఠలధరణీశుడు - చోడోదయుని ఇతర సైన్యాలు గన్నారెడ్డి సైన్యాలను వెనుకనుండి తలపడకుండా - అడ్డుపడినాడు. చోడోదయుని ఆశ్వికులు గన్నారెడ్డి ఆశ్వికులు ఆ దినమంతా జరిపిన యుద్ధము దేవతలు విమానాలపై వచ్చి తిలకించినారని కవులు గానం చేసిరి.

ఆ పిమ్మట ప్రవర్తిల్లిన సంకులయుద్ధంలో గన్నారెడ్డి కొద్దిమంది ఆశ్వికులతో గోదావరిని ఈదే ఏనుగులా తక్కిన ఆశ్వికసైన్యాల మధ్యనుండి చొచ్చుకుపోయినాడు. ఆవీరుడు చేసిన దారిని ఆరువేలమంది ఆశ్వికులు చోడోదయుని ఇరువదివేలమంది అశ్వ సైన్యాన్ని రెండుగా చీలుస్తూ చొరబడినారు. ఈ సైన్యాన్ని ఎదుర్కొనడానికి తిరిగిన చోడోదయుని సైన్యాన్ని మల్యాల చినదామానాయుడు తన సైన్యంతో వెనుకవైపున తాకినాడు.

ఈ కారణంచేత రెండుగా చీలిన చోడోదయుని ఆశ్వికసైన్యాలు మూడుగా చీలినవి. గోన గన్నయ్య ఇట్లు శరవేగంతో ముందుకు చొచ్చుకుపోయి చోడోదయుని తాకినాడు. ఆఇద్దరు వీరులూ ఆశ్విక శ్రేష్టులే కాని గన్నారెడ్డి అశ్వపునడక మెరుమువేగము.

రెండుమూడుసారులు గన్నారెడ్డి చోడోదయులమధ్య ఇతరాశ్వికులు యుద్ధం చేస్తూ అడ్డం వచ్చినారు కాని గన్నారెడ్డి వారిని తప్పించుకొని చోడోదయుని మరల తాకినాడు. చోడోదయుడు, ఎడమ ముష్టితో మణులు పొదిగిన బంగారుకళ్ళెము బూని గుఱ్ఱాన్ని విచిత్రగతులు నడిపినారు. గన్నారెడ్డి గుఱ్ఱము సూర్యుని గుఱ్ఱములా చరించినది. చోడోదయుని కత్తి ఘాతాలకు తనఫలకాన్ని అందిస్తూ గుఱ్ఱాన్ని మాటచేతనే నడుపుతూ గన్నారెడ్డి, చోడోదయునికి, వానిగుఱ్ఱానికి గాలి పీల్చుకునేందుకన్నా వ్యవధి ఈయలేదు.

ఇరవై క్షణములలో చోడోదయునిచేతి పట్టుసూత్రము రెండు ఖండము లై పడిపోయినది. పదిక్షణములలో కత్తి ఆతనిచేతినుంచి ఎగిరి క్రింద పడినది. ఇక రెండు నిముషములలో చోడోదయుడు క్షతగాత్రుడై క్రిందపడిపోయినాడు. గోన గన్నారెడ్డికి అంగరక్షకుడుగ ఉన్న అక్కినప్రగడ ఒకడే ఉరుకున చోడోదయుని సమీపించి, అతని చేతులకు బంగారు గొలుసులు తగిల్చినాడు.

చోడోదయుడు బందికావడంతోటే సేనాపతులు చేతులెత్తి యుద్ధ మాపు చేసినారు.

చోడోదయుని బందీగాగొని గోన గన్నారెడ్డి చోడోదయుడు నిర్మించుకొన్న రాజశిబిరానికి వెళ్ళి అక్కడ కొలువు తీర్చినాడు. చోడోదయుని ఉత్తమాశ్వాన్ని గోన గన్నారెడ్డి సైన్యాలు తమప్రభువు గుఱ్ఱంతోపాటు అశ్వశాలలో పెట్టి సంరక్షణ చేస్తూ ఉండిరి.