పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

210

గోన గన్నా రెడ్డి

దుర్మార్గులను, రాజద్రోహులను నాశనంచేసే పని పెట్టుకొని ఈ మహాసైన్యం పెంచుకొన్నాము. శ్రీశైల మల్లికార్జునుడు మనపక్షం ఉన్నాడు కాబట్టే మనకు కోట్లకొలది ధననిధులు దొరికాయి. ప్రజలే భగవంతుడు. ప్రజానురంజనమే భగవద్భక్తి. మన చక్రవర్తి, దీనబాంధవుడు కైలాసవాసి అయినాడు. ఈతరుణంలో సరిహద్దుభూములలో కుట్రలు, అరాజకము, కాటకము, తుచ్ఛరోగ తాండవము, చోరవృద్ధి తటస్థిస్తుంది. కాబట్టి ఈ నాటినుంచి మనం శ్రీ రుద్రచక్రవర్తి సింహాసనం అధివసించి సుఖసంవిధానం చేసేవరకూ అప్రమత్తులమై ఉండాలి. ఆ వెనుక మన గజదొంగతనం ఈ రహస్యనగరంలోనే భూస్థాపితం అగుగాక. అలా కాని పక్షంలో మన జన్మలు గజదొంగలుగానే ముగిద్దాము” అనే గన్నారెడ్డి మాటలు కైలాస వాక్కులులా వినబడ్డాయి.

3

ధీరహృదయ, విద్వాంసురాలు, రాజ్యపాలన ప్రజ్ఞావతి అగుటచేత రుద్రమదేవి తండ్రిపోయిన దుఃఖాన్ని తన బ్రతుకు పడవను ముందుకు గొనిపోయే అనుకూల వాయుశక్తిగా చేసికొన్నది. ఆమె హృదయంలో సంతోషము నశించింది; అనుమానం పటాపంచలయింది! వెనుకటి డోలాయమాన మానసికావస్థ నశించింది. గుప్పిళ్ళు బిగించి, కనుల తీక్ష్ణకాంతులు ప్రసరింప, దేహమంతటా శక్తి పొదవికొనగా, దృఢ ప్రతిజ్ఞావతియై కర్యరు రాలైంది.

ఆమె స్త్రీవేషము మానింది. సర్వకాల కవచధారిణియై, సైన్యాలను భయంకరాయుధంగా సిద్ధంచేయ సంకల్పించుకొన్నది. ఆమె కోమలత్వం వజ్రకాఠిన్యం సవదరించుకొంది. ఆమె సౌందర్యం మహాదుర్గా సౌందర్యమై వికసిల్లినది.

ఆమెకు ప్రొద్దుపోయినగాని నిదురపట్టదు; పట్టిన పదిగడియలలో మరల మెలకువ.

ఆమె ఆలోచనలు ఆంధ్రవిరోధి సంహరణము, ఆమె కాంక్ష అవధిలేని లోకపురోగమనము.

ఆమె ఉదయాస్తమానాలు అన్నాంబికతో కత్తియుద్ధ పరిశ్రమచేయును. అన్నాంబికతోపాటు విలువిద్యలు, సూక్ష్మతలు నిరంతరపరిశ్రమచేసి సాధించును. వివిధాశ్వారోహణలు, అశ్విక యుద్ధాలు, రథనూత కారిత్వము, రథయుద్ధకౌశలము, వివిధ వ్యూహనిర్మాణము, వివిధ వ్యూహచ్ఛేదము, వివిధాయుధ ప్రయోగము ఇవన్నీ దీక్షతో అభ్యసింప నారంభించినది.

స్వయంగా ప్రసాదాదిత్యునితో కలిసి, ఓరుగల్లుకోట బాగుచేయించసాగిందా మహారాణి. ఏటిసూతకమైనవరకు తాను సింహాసన మధివసించదట. శివదేవయ్య