పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణవేణి

209

ఎడమప్రక్క నిలుచున్నాడు. సబ్బారెడ్డికి ఎడమప్రక్క ఉత్తమ వెలమరెడ్డి కులమనే పాలసముద్రానికి బాలచంద్రుడు, అభిమన్యసత్వుడు, సంతత సంతోష ప్రపుల్ల వదనుడు, దివ్యధనుస్సుకలవాడు, అతి వేగాలయిన బాణాలతో సూటితప్పక ఎట్టివస్తువునైనా ఎంతటిదూరములో ఉన్నా ముక్కలు చేయగలవాడు రేచెర్ల బేతిరెడ్డి మహాప్రభు తనయుడు సోమారెడ్డి నిలిచిఉన్నాడు. ఆయనప్రక్కనే రేచర్ల ప్రసాదాదిత్యప్రభువు కుమారుడు చినదామానాయకప్రభువు నిల్చుండి ఉన్నాడు. ఆ ప్రభువు పగతురకు వెన్నిచ్చి ఎరుగడు. యుద్ధప్రారంభమందు ఏమినవ్వునో మళ్ళీ యుద్ధాంతమందే నవ్వుతాడు. ఈ లోగా ప్రచండ సూర్యాగ్ని అతడు; పసికట్టిన మహానాగము. కత్తియుద్ధములో అతన్ని ఓడించగల యువకు డొక్క గన్నారెడ్డి ప్రభువే!

విఠలధరణీశునకు కుడిప్రక్క చినఅక్కినప్రగడ ఉన్నాడు. ఆ బాలపండిత కుమారస్వామికి, వ్యాసునకు తప్పులు దిద్దగల ఆ పండితుడు యుద్ధావసరం వస్తే రామబాణం, చక్రధార, పాశుపతాస్త్రమును.

మల్యాల చౌండసేనాధిపతికి ఇద్దరు కొమరులు, ముగ్గురు కొమరితలుఉన్నారు. వారయిదుగురు భీమసంతతివారు. కొమరులిద్దరూ మహాసత్వులు, విఠలధరణీశునే యుద్ధానికి పిలువగలరు. ఆ బాలికలు గదాయుద్ధంలో అన్నగారిని, తమ్ముణ్ణి ఒక్కొక్కప్పుడు ఓడించేవారు ఆ యన్నదమ్ములలో కాటప్రభువు గన్నారెడ్డి జట్టులో చేరిపోయినాడు. పదియారేళ్ళ ఆ బాలప్రభువు మహాతోమరధారియై అక్కినప్రగడ కుడిప్రక్కను నిలిచిఉన్నాడు.

ఇంకనూ అక్కడ చేరిన ఆంధ్రక్షత్రియవంశ్యులలో మున్నూరు కాపు వీరప్రభువు మలుగంటి రుద్రనాయకుడు గజసాహిణి. గన్నారెడ్డిహృదయం చూరగొన్న ఆ వీరుడు కాటయప్రభువు ప్రక్కను నిలిచి ఉన్నాడు.

రామరాజు, గణపతిప్రభువు, వెలమదొర మండయ్య ప్రభువు, పులవరి బొల్లిరెడ్డిప్రభువు. గోనం కామిసేనాని, వివరము నరహరినాయకుడు, పంట అన్నరెడ్డిప్రభువు, గొచ్చెబమ్మ సేనాని అనే ప్రభువులు వారి వారి సేనాముఖాల నిలుచుండి ఉన్నారు.

గోన గన్నారెడ్డి తన మహాసైన్యాన్ని చూచి, ‘ఆంధ్రవీరులైన మీకు ఒక మహావిషాదవృత్తాంతం వినిపించవలసివచ్చింది. మనప్రభువు శ్రీ గణపతిదేవ చక్రవర్తి అస్తమించారు’ అని విషాదకంఠంతో తెలియచెప్పెను. ఆ మాటలు దగ్గరి వారికే వినబడినవి. అక్కడినుండి చారులు వారిమాటలను సైన్యం అంతకూ అందిచ్చినారు.

“మనం ఎంత గజదొంగలమైనా, హీనత్వానికి పాలుపడలేదు. మన చక్రవర్తులకు ఎప్పుడూ భక్తి చూపించాము. అజభక్తితో, భగవద్భక్తితో