పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

208

గోన గన్నా రెడ్డి

భల్లాణులు; దేవగిరిలో యాదవులు; కాళింగాన ఒడ్డెరాజులు ‘అమ్మయ్యా’ అని ఇంతగాలి గట్టిగా పీల్చుకున్నారు.

కృష్ణవేణీతీరంలో తన రహస్యనగరంలో గోన గన్నారెడ్డి ఇక “ఆంధ్ర మహాసామ్రాజ్యానికి ప్రళయం సంభవించింది” అని నిట్టూర్పు విడిచినాడు. ఆ మరుసటిక్షణంలో విశాలమై, మహాపర్వతసానువై, ఆంధ్ర ప్రతాపాలవాలమై ఆంధ్ర క్షత్రియకుల శ్రీనివాసమైన అతని వక్షము ఇంకా విస్ఫారితమైనది. దౌవారికుని చీరి ‘మహాసభాఘంటిక మ్రోగింపు’ మని ఆజ్ఞ ఇచ్చినారు.

మరి పదిక్షణికాలకు లోకకుహరాలన్నీ మారుమ్రోగుతూ ఒక పెద్ద జయగంట మ్రోగటం ప్రారంభించింది. ఆ మ్రోత ఆ రహస్యపులోయ అంతా నిండగానే రాచనగరుకు ఎదురుగాఉండే విశాల ప్రదేశాలలో గజదొంగల సైన్యాలన్నీ బిలబిల చేరడం ప్రారంభించాయి. సేనాపతులు, దళవాయులు, సాహిణిలు అందరూ యథోచితవేషాలతో ఆ ప్రదేశానికివచ్చి యథాస్థానాల బొమ్మలులా నిలబడినారు.

మూడుగడియలలో గోన గన్నారెడ్డి సైన్యం యావత్తూ సంపూర్ణంగా ఆ ప్రదేశంలో బారులుతీర్చి, రాతివిగ్రహాలులా నిలబడి ఉన్నది. దుష్టతురగ రేఖారేవంతుడు, రాజద్రోహరగండ, గండరగండ మహావీరుడు, యౌవన శ్రీవిష్ణుడు, దుష్టమానవ భీకరుడు, ఆజానుబాహుడు, మనోహరాంగుడు, కామినీ జయంతుడు, అర్జున ప్రతాపుడు అగు గోన గన్నారెడ్డి కోలమోముతో, సోగ మీసాలతో, ప్రత్యక్షమైన కుమారస్వామిలా ఉత్తమ శ్వేతాజానేయము నధివసించి మెరుపులా వచ్చి తల లక్ష ముప్పదివేల సైన్యముఖంలో నిలుచున్నాడు.

ఒక్కసారి ఆ లక్షమంది తామ్ర కంఠాలలోనుండీ ‘జయ! జయ! గోన గన్నారెడ్డిప్రభూ! జయ! జయ!’ అని రోదసీకుహరం నిండే జయధ్వానాలు ఉద్భవించాయి. మహావీరుని కుడిప్రక్క అపరభీముడు, మహాసత్వుడు, గజబలుడు మేరుశృంగంవంటి రూపంకలవాడు అశ్వత్థతరుకాండాలలాటి చేతులుకలవాడు కండలుతప్ప కొవ్వులేని దేహాంగాలు కలవాడు, ఏనుగులతో మల్లయుద్ధంచేసి నెగ్గగలవాడు, ఉరుమువంటి కంఠధ్వని కలవాడు గోన విఠలధరణీశుడు మహాసేనాపతి కిరీటలాంఛనంతో ఉన్నతమైన గదను ధరించి నిలుచున్నాడు.

గన్నారెడ్డికి కుడిప్రక్కను కదలివచ్చే కొండలాంటివాడు, ముష్టి ఘాతం చేతనే బండరాళ్ళను పిండిగొట్టగలవాడు; విఠలధరణీశుని కుద్దియగు వాడు, సముద్ర గర్జన కలవాడు దోసపాటి సూరన్నరెడ్డి ప్రభువు హిమాలయ శిఖరంలా నిలుచున్నాడు. అవక్రవీరుడు, సింహంలాంటివాడు, మాయలలో గంధర్వులకు విద్యనేర్పేవాడు విరియాల సబ్బారెడ్డి ప్రభువు సూరన్నరెడ్డికి