పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణవేణి

207

శివదేవయ్య దేశికులు రుద్రమాంబను సమీపించి, ‘జయము, రుద్రమహాప్రభూ! జయము. ఇక తాము అష్టమ చక్రవర్తులు. రాజనీతి దుఃఖానికెడ మీయదు. ఒక్కనిమేషమాత్రమైనా దేశము అరాజకం కాకూడదు. సార్వభౌమా! ఈ గడియ నుండి తా మీ చతుస్సముద్రముద్రిత మహాభూమి భారం వహించినవారయ్యారు. దేవతాస్వరూపులయిన తండ్రిగారి ఆజ్ఞ భగవంతుని ఆజ్ఞగా పరిపాలించండి' అని రుద్రచక్రవర్తిని చేయిపట్టి లేవతీశాడు.

కన్నులు మూసుకొనే ప్రార్థిస్తూ రుద్రమలేచింది. పూజామందిరంలో నుండి రాజసభామందిరంలోనికి విచారసముద్రములో మునిగిఉన్నా గంభీర వదనయై వచ్చిన రుద్రమహాదేవిని చూడగానే ఆ సభామందిరంలో కూడిన సామంతులు, సేనాపతులు, పండితులు, ప్రజ్ఞ, సభాధికారులు, ‘జయ జయ శ్రీ రుద్రమదేవ చక్రవర్తీ! జయ జయ’ అని నినాదాలు సలిపారు.

అప్పుడు వందులు ఇరువదిమంది ముందుకు వచ్చినారు. వారి నాయకుడు రుద్రమచక్రవర్తికి ఎదురుగా నిలబడి ‘జయ జయ సమధిగత పంచమహాశబ్ద మహా మండలేశ్వర పరమమాహేశ్వర! హన్మకొండ పురవరాధీశ్వర! సత్య హరిశ్చంద్ర! చతుస్సముద్రవలయిత దిక్పూరితకీర్తి! అష్టమచక్రవర్తీ! జయ జయ జయ, అంటూ జయజయ ధ్వానాలు చేశారు.

తండ్రి పరమవృద్ధులై రాజ్యంలో ఏవిధములైన కలతలు లేకుండా పవిత్రదినమైన శివరాత్రినాడు లింగైక్యమందినారు అంతకన్న శుభం ఏముంది?

తన దుర్బల భుజాలు, తండ్రిగారు సులభముగా వహించిన భూభారం వహించవలసి ఉంటుంది. అన్నిటికీ బలము పరమశివుడు, కాకతీదేవీ, సర్వజ్ఞులైన శ్రీ శివదేవ దేశికులూ - వారి సహాయమే తనకు సూర్య చంద్రులూ, నక్షత్రాలూ కాగా, తాను ఈ రాజ్యభారం వహిస్తుంది. ఈ కార్యంకొరకేకదా తనకు మొదటినుండి తండ్రిగారు సర్వవిద్యలూ నేర్పించి రాజ్యపరిపాలనా విధానంలో ప్రవీణత ఇప్పించినారు.

తాను సర్వదేవతలు సాక్షిగా మాట ఇచ్చినది.

ఎవ్వరూ చూడకుండా ఆ బాలిక చిన్నబిడ్డలా తన రహస్యమందిరంలో మంచంమీద మేను వాల్చి లోచనాంచనాల సంతతధారగా ప్రవహించే బాష్పప్రవాహంతో కరిగిపోయింది.

2

శ్రీ గణపతి రుద్రదేవప్రభువు దివంగతు డయ్యాడని ఒక్కసారిగా సకలభారతావని మ్రోగిపోయింది. దక్షిణాన పాండ్యులు, చోడులు,