పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

194

గోన గన్నా రెడ్డి

కాటయ్య: నిజమే. మేడిపల్లి బాచయనాయకునిగతి ఏమయింది మహారాజా! ఉప్పలసోముడు, కోసగిమైలి, వందిభూపాలుడు ... వీడు ఎదుర్కొన్నవాడు బ్రతికి బయటపడలేదు.

పేర్మాడి: ఏమిచేయాలి? భేతరాజునుచంపి ఆ కండలు కోటగోడ నుంచి అవతల పారవేస్తే?

కాటయ్య: ఆ తలపువద్దు మహారాజా! మనల నిద్దరిని గుఱ్ఱాలకుకట్టి దేశాలన్నీ ఈడ్పిస్తాడు.

పేర్మాడి: ఏమయ్యా! మీరు వట్టి పిరికివారై పోయినారేమిటి?

కాటయ్య: రావణాసురుడి ఎదుట నుంచుంటే పిరికివాళ్ళుకాక ఎగరగలరా ఎవరైనా మహారాజా!

పేర్మాడి: అయితే వీడికి లోబడి శరణువేడుకోవడమే ఉత్తమం. తరువాత మనకు సహాయం చేస్తానని రహస్యవేగులు పంపిన ఆ మహానుభావుడి పనైనా కనుక్కుందాము.

అతివేగంతో, రౌద్రంతో తలపడిన గన్నారెడ్డి సైనికులకు బాసటగా నడి రేయి దాటిన రెండుగడియలకు ఉప్పెనలా విఠలయ్య, తక్కిన సైన్యముతోవచ్చి ధాన్యకటకాన్ని ముట్టడించాడు.

పేర్మాడిరాయని సైన్యాలలో దొరకిన ఒక దళపతిని పట్టుకొని గన్నయ్య కోటలోనికి వార్త పంపించాడు. ‘తెల్లవారేలోపుగా మాకు కోట స్వాధీనం చేయవలసింది. శ్రీ భేతమహారాజులంవారికిగాని శ్రీ గణపాంబాదేవి మహారాణులకుగాని, రాజబంధువులకుగాని, రాజభక్తులకుగాని, రాజప్రియులకుగాని, రాజోద్యోగులకు గాని ఏమాత్రం హానికలిగినా పేర్మాడిరాయని, కాటయ్యను బోనులలో పెట్టి సర్వదేశాలు తిప్పుతాను’ అని.

పేర్మాడిరాయుడు గజగజ వణకిపోయాడు. తెఱాల కాటయ్య చెమటలు కారిపోయాడు. వారు తమ సర్వసైన్యాలను ఆయుధాలను విసర్జింపచేసి కోటతలుపులు పూర్తిగా తెరిచి, కాగడావెలుగులలో తెల్ల జెండాలు ధరించి చేతులు కట్టుకు వచ్చి గోన గన్నయ్య పాదాలమీద పడినారు. కోటద్వారాలగుండా గన్నయ్య, విఠలయ్యల సైన్యాలన్నీ ధాన్యకటక నగరంలోనికి వచ్చాయి.

తెల్ల వారింది. కోట పేర్మాడిరాయని, తెఱాల కాటయ్యను రక్షకభటులు రాజసభాసమావేశం చేయించారు. స్నానసంధ్యానుష్ఠానాలన్నీ తీర్చి గోన గన్నయ్య తన తమ్మునితో స్నేహితులతో సభాప్రవేశం చేశాడు. శ్రీ కోట భేతమహారాజును సగౌరవంగా బందునుండి విముక్తి చేశారు. రాజబంధువులు, మంత్రులు, సేనాపతులు మొదలైనవారందరూ విముక్తులయినారు. వారందరూ యథోచితంగా రాజసభను ప్రవేశించినారు. మహావీరులైన చక్రవర్తి జామాత శ్రీ కోట భేతమహారాజులంవారు తమ రాజసభను ప్రవేశించినారు. అందరూ లేచి నిలిచారు. మహారాజు