పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుట్ర

13

పశ్చిమానికి చాలా విస్తరింపజేసెను. ఆదవోని మండలేశ్వరుడైన శ్రీకోటారెడ్డి దేవర మహారాజులుంగారున్నూ చాలా సహాయంచేసిరి.

శ్రీ శ్రీ గణపతిదేవమహాచక్రవర్తి యువతి అయిన తన పెద్దకుమార్తెను పురుషవేషంతో శిఖండిలా మహారాజుగా యువరాజ్యభారం వహింప చేసేటప్పటికి లకుమయారెడ్డికి కోపం మిన్నుముట్టింది. డెబ్బదియేండ్ల వృద్ధుడైన ఆ మహాభిమానికి ఆడదాని చేతి కూడు తినడం వీరపురుషులకు తలకొట్టినట్లే అనిపించింది. తలుచుకొన్నకొద్దీ కోపం గాలివాననాటి మేఘంలా పెరిగిపోతోంది. చేవతప్పని అతని వీరరూపం వణికిపోయింది. రుద్రమదేవిని సింహాసనంమీది నుంచి లాగివేసి వంటయింటిలోనికి పొమ్మందామని అనుకున్నాడు.

అయితే శ్రీ శ్రీ గణపతిరుద్రదేవ చక్రవర్తులవెనక సామ్రాజ్యానికి సింహాసనం ఎక్కించడం ఎవరిని? హిమాలయశిఖరం నుంచి గంగాదేవివలె వీపున ప్రవహిస్తూఉన్న ఆతని తెల్లనిజుట్టున్ను, బవిరిగడ్డమూ ఊగిపోయాయి. ఆ మహా సమ్రాట్టుకు కొడుకులేడు. చివరకు దౌహిత్రుడన్నాలేడు. ఆడుది రాజ్యం చేయుటా? అర్జునుణ్ణి జోహారనిపించే ఈ వీరపురుషులూ, మహారాజులూ ఆడుదానికి జోహారు చేయుటా? తమ తమభావాలు తెలుపవలసినదిగా మండలేశ్వరులకడకు తాను పంపిన తన ద్వితీయసచివుడు చిన్నయామాత్యుడు పొత్తపినాండు విషయ మహా మండలేశ్వరుడు, బేడచెలుకిరాయడు, ఆదవోని మహామండలాధిపుడు కోటారెడ్డి పూగినాటి విషయాధిపతి కోట పేర్మాడిరాయడు, కందవోలు రాజ్యాధిపతి వంది భూపాలుడు యావన్మందిన్నీ ఈ ఆడది రాజ్యం చేయడం ఇష్టంలేదన్నారని వేగు తెచ్చాడు.

“ఇక ఆవల వీరావతారుడైన జన్నిగదేవుడు, ప్రతాపనాయుడు, అసాధ్యుడు చాణక్యుడులాంటి శివదేవయ్యమంత్రీ ఉన్నారు. వాండ్లకు మడపల్లె దుర్గాధిపతి, పల్లవనాటిరాజు, వెలనాటిప్రభువు, వేంగీరాజ్యాధిపతీ బాసటగా ఉన్నారు. చక్రకోట్యమండలం, కమ్మనాడు, మేడిపల్లి కాచయనాయుడు - ఆ ప్రభువులంతా బెల్లంకొట్టినరాళ్ళులా ఊరకొన్నారు. వీలయితే తిరగబడి తమ రాజ్యాల్ని స్వతంత్రం చేసుకోవాలనీ, లేకపోతే మేము రాజభక్తిపూరితులము అని చెప్పాలనీ, ఎవరిమట్టుకు వారికి సమ్రాట్టు అవుదామనీ ఉందనుకుంటాను” అని చిన్నయామాత్యుడు మహారాజుతో చెప్పినాడు.

“ఆదవోని మహారాజు మహాబలవంతుడు. కర్ణాటరాజు భల్లాణ భూపతిని నాలుగుసారులు ఒక్కడే ఓడించా డా ప్రభువు. ఆ మహారాజుకుమార్తె అన్నమాంబాదేవి చాలా అందమయినది. యువరాజులవారికి ఈడు. ఈ రెండు రాజ్యాలు ఏకమైతే రుద్రమదేవికి బలం ఎక్కడ? ఆదవోనివారికి దగ్గరచుట్టాలే కందవోలు రాజ్యాధిపతులు” అని ముఖ్యమంత్రి రుద్రయామాత్యులవారు సెలవిచ్చారు.