పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

192

గోన గన్నా రెడ్డి

రుద్రా: ఎంతచక్కగా అన్నావు చెల్లీ! ఇక సిద్ధంకా!

పూర్ణిమ వెళ్ళిన తదియనాడు మహారాజు పడికము బాప్పదేవమహారాజుతో సైన్యాలన్నీ నడుపుకొంటూ మహావేగంతో కృష్ణాతీరంవైపు వెడుతున్నారు. ధాన్యకటకందగ్గర దాటడంకన్న విజయవాటికకు దిగువను కృష్ణానదిని పడవలలో దాటడానికి రుద్రమహారాజు ఆజ్ఞ దయచేయించారు. అపసర్పగణనాయకశ్రేష్ఠులైన గొంక ప్రభువులున్నూ, నతవాటిసీమవారైన మేనత్తల వంశంవారూ అనేకాలైన నావలను పోగుచేస్తున్నారు.

దారిలో ప్రధానఅంగరక్షకాధిపతిగా ఒక యువకవీరుడు కవచధారియై మహారథం ప్రక్క రథం అధివసించి అంగరక్షక చక్రరక్షక నాయకుడై వస్తున్నాడు. మహారాజు గుంటూరు పట్టుకుంటే ఆ వెనుక ముమ్మడాంబిక రావచ్చుననీ, అటువెనుక కంచి, కాళహస్తి, శ్రీశైలాది క్షేత్ర దర్శనం చేసి సంక్రాంతినాటికి తిరిగి ఓరుగల్లు రావడానికి నిశ్చయంచేసుకున్నాననీ చెప్పి ముమ్మడాంబికను ఒప్పించెను.

అన్నాంబిక ఉప్పొంగిపోయింది. ఆమె మోము తేజరిల్లిపోయింది. ఆమెకు రుద్రాంబికవలె ఇదే ప్రథమయుద్ధం,

శ్రీ గోన గన్నారెడ్డి ప్రభువు ధాన్యకటకమహారాజును పట్టుకొన్న కోట పేర్మాడిరాయుడిపైకి వెళ్ళినారని రుద్రమహారాజు తనతో చెప్పినారే! వారు ఎప్పుడూ గన్నారెడ్డిప్రభువుపై కత్తికట్టరే! ఆప్రభువైనా చక్రవర్తివైపు కన్నెత్తి చూడరే! దొంగలు పెద్దప్రభువుల జోలికి పోక చిన్నవారిని దోచుకుంటారు కాబోలు! అయితే ప్రభువులు ప్రజలను రక్షించాలికదా! అందుకేకాబోలు దొంగలూ, ఇళ్ళు తగులబెట్టినవారూ, పంటలు నాశనము చేసినవారూ కఠినశిక్షలకు పాత్రులవుతున్నారు. ఇది దొరతనమా! దొంగతనమా!

గన్నారెడ్డి సమున్నత విగ్రహమూ, ఆయన సింహపరాక్రమమూ, ఆయన పరమాద్భుత యుద్ధనిర్వహణశక్తీ, వ్యూహరచనా చమత్కృతి లోకసమ్మోహనకరాలు, అలాంటి ఉత్తమపురుషుడు పినతండ్రి తనకన్యాయం చేసినంతమాత్రాన గజదొంగైపోవాలా?

ఆయన విశాలఫాలం, కన్నులలో కాంతి, వెడదఉరము, సన్నని నడుము, దీర్ఘబాహువులు, బంగారాన్ని నలుపుచేయు పసిమి, సోగమీసాలు, ముత్యాలకోవ పలువరుస ప్రతిదినమూ అన్నాంబిక ఒంటిగా ఉన్నప్పుడు తలచుకొంటూ ఏవేవో స్వప్నాలు కంటూ ఉంటుంది.

ప్రతిదినమూ భోజనాలు కాగానే ప్రయాణముసాగును. సాయంకాలమొక నగరం బైట శిబిరముల స్థాపింతురు. రాత్రి అంతయు, ఆ స్కంథావారంలో విశ్రమిస్తూ, వారు ప్రయాణం చేస్తున్నారు మహారాజపథం వెంటనే.