పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

188

గోన గన్నా రెడ్డి

వెఱ్ఱితల్లీ! నేను ఇంకకొద్ది నెలలుమాత్రమే ఉంటానని నాకు పూర్తిగా నమ్మకము. అయినా మన దేశికులు వసిష్ఠసమానులు. ఎన్నిసామ్రాజ్యాలన్నా చిటికెనవ్రేలితో మోయగలరు.”

“అదేధైర్యం నాయనగారూ! లేకపోతే ఈ మహారాజ్యభారం వహించడం స్త్రీమాత్రకు శక్యమా?”

“అవేమిమాటలు తల్లీ! సంపూర్ణబాధ్యతతో రాజ్యభారం సునాయాసంగా వహించగలుగునట్లుగా నీకు శిక్షగరిపాము. మొదట అంత ధైర్యంచెప్పి మళ్ళా సాధారణ స్త్రీవలె భయపడిపోతావేమి?”

“మీరు నాకు అప్పగింతలు చేయుచున్నట్లు మాట్లాడితే భయంవేసింది!”

అప్పుడే శివదేవయ్య దేశికు లక్కడకు వస్తున్నారని దౌవారికుడు మనవి చేశాడు.

వెంటనే చక్రవర్తి రుద్రదేవ సహాయంతో లేచి, శివదేవయ్య మంత్రి రాగానే ఇరువురు వారికి నమస్కరించారు.

అందరూ ఆసీనులైన వెనుక ఈ మాటలూ ఆ మాటలూ జరిగాయి. మత విషయకమైన విషయాలేవో వచ్చాయి. శివదేవయ్య అప్పుడు రాజకుమార్తె మోము వంక చూచి, ‘రాజకుమారీ! చక్రవర్తికి ఏదో సందేహం కలిగింది. మీరు స్త్రీలు కాబట్టి ధర్మశాస్త్రప్రకారం రాజ్యం పాలించడానికి అర్హత ఉన్నా, ఆచారప్రకారము లేదు. అయినా దేశమూ, దేశపరిస్థితులూ ఆలోచించి చక్రవర్తి మిమ్ము భావిచక్రవర్తిగా నిర్ణయించాడు’ అనిగంభీరముగా పలికెను. మరల నామె మోమున చూడ్కి నిలిపి ‘ఆ నిశ్చయప్రకారం తమకు వీర విద్య నేర్పి యువరాజులనే లోకంలో ప్రచురించారు. తరువాత రాజనీతిని అనుసరించి తాము స్త్రీలే అని ప్రచురిస్తూ రాజ ప్రతినిధిని చేశారు’ అనియెను.

రుద్ర: చక్రవర్తి ఆజ్ఞలు శిరసావహించితినికదా గురుదేవా?

శివ: అవును మహాప్రభూ! ఇక చక్రవర్తిగారూ సంపూర్ణంగా లోక వ్యవహారాలు వదలివేయదలచుకొని తమ్ము కొన్ని వాగ్దానా లిమ్మని కోరదలచుకున్నారు.

రుద్ర: మహాప్రసాదం.

శివ: తాము సార్వభౌమత్వ భారం వహించి నవమ చక్రవర్తులు కావాలనీ; రెండు - తాము వివాహం చేసుకొన్న పురుషుడెంత మహోత్తముడైనా ఆయన చక్రవర్తి కాకూడదనీ; మూడు - రాజ్యార్హుడైన తమ కుమారుడు రాజ్యం వహించేముందు కాకతీయవంశానికి దత్తుడు కావాలనీ.

రుద్రమ ఇవన్నీ విన్నది. ఏవేవో ఆలోచనలకు లోనయింది. తాను వివాహం చేసుకున్న పురుషుడు చక్రవర్తి కాకుండుటెట్లు? సామ్రాట్టు భార్య సామ్రాజ్ఞి. సామ్రాజ్ఞి భర్త సామ్రాట్టు కారా?