పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాకతమ్మ

183

లోనికి తన అతిథులకు భోజనాదికమ్ము లేర్పాటు చేయడానికి వెళ్ళిన మాచనమంత్రి సభాశాలలోనికి వస్తూ ఆ మాటలు విని ఒక పరిచారికను పిలిపించి ‘అమ్మాయి సీతను, కల్యాణినీ తీసుకొనిరా’ అనిఆజ్ఞ ఇచ్చినారు. పది క్షణికాలకు నూత్నాలంకారాలు తాల్చిన సీతా, కల్యాణీ పరిచారిక వెంట అక్కడకు వచ్చారు. గోన గన్నారెడ్డి వారివంక చూచి, నా చిన్నచెల్లీ! రావమ్మా కల్యాణీ! మీ పెద్దన్నగారిదగ్గర సిగ్గేమిటమ్మా!’ అన్నాడు నవ్వుతూ.

సీత: సిగ్గుకాదండి, అన్నయ్యగారిని దర్శనం చేయడానికి సరియైన వేషంతో రావాలని పారిపోయాం.

గోన: నేను వచ్చేసరికి నువ్వే వీణవాయిస్తూ పాడుతున్నావు కాదూ! గొంతుక పోల్చుకుంటున్నాను.

సీత: అవునండి. మాబావ పాడమంటే.....

గోన: అవును తల్లీ బావే నిన్ను పాడమంటాడు. బావను రెండు పద్యాలు చదువ మనలేకపోయినావూ ఆయనగారు చేసినవానినే!

అక్కిన: ఆయన మాటలు నమ్మకు సీతా!

కల్యాణి: నువ్వు దొంగవులే, నీమాటలేమీ నమ్మనులే బావా!

గోన: నిజం తల్లీ! వట్టి దొంగబావ! నమ్మదగిన మనిషికాడు. అతి తియ్యగా అద్భుతంగా కవిత్వం చేయగల కవి! ఈమధ్య స్కాందము ఆంధ్రాన రచన చేస్తున్నాడు. వినితీరాలి చెల్లీ!

అక్కిన: మా ప్రభువు గంభీరకంఠంతో పాడుతూఉంటే మందార కుసుమాలు విరిసి మధువులు ప్రవహిస్తాయి సీతా!

మాచన: ఇద్దరూ ఒకరి రహస్యాలు ఒకరు వెల్లడించుకొంటున్నారు. అయితే ప్రభూ! ఈ మధ్యాహ్నము వర్జ్యమేమీలేదు. శుభలేఖలు వ్రాయించి పంపుతాను.

గోన: తప్పకుండా పంపించండి బాబయ్యగారూ !

9

భోజనానంతరం గన్నారెడ్డి, అక్కినప్రగడ ఇద్దరూ కూర్చుండి కొంచెం కాలం సీతమ్మ వీణపాట విన్నారు. కొంతసేపు కల్యాణి పాడిన ముద్దులుగులికే పాటలు విన్నారు. గన్నారెడ్డి వారిద్దరకూ చెరి ఒక ముత్యాలహారమూ బహుమాన మిస్తూ ‘ఈ హారాలు మాకు దొరికిన పాతులోవి’ అన్నాడు.

ఆ బాలలు వెళ్ళిపోగానే, ఆ యిద్దరే అక్కడ కూరుచుండిరి. వెంటనే అక్కిన గోన గన్నారెడ్డిని చూచి, ప్రభూ! అన్నీ తెలిసికొన్నాను. పూగినాటి విషయాధిపతి కోట పేర్మాడిరాయుడు, చక్రవర్తికీ తనకూ ఉన్న చుట్టరికమైనా