పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాకతమ్మ

181

గ్రామాధికారి అయిన శ్రీ మాచనమంత్రిసత్తముల భవన మెక్కడని తెలిసికొంటూ మాచనమంత్రి భవనం చేరాడు. మాచనమంత్రి భవనంచుట్టూ కావలికాచే తన సైన్యంలోని భటులు త న్నానవాలుపట్టి వంగి నమస్కరింప వారిని ఆశీర్వదిస్తూ, గుఱ్ఱం చెంగున ఉరికాడు.

ద్వారపాలకునితో ఒక సైనికుడు ‘శ్రీ గన్నారెడ్డి సాహిణి మహారాజులం వారు వచ్చారు’ అని మంత్రిగారికి తెలపవయ్యా అనేసరికి, వాడు ఉలిక్కిపడి, సభాశాలకు పరుగిడి అక్కడ పంచాయతీదారులతో, తన మహామండలేశ్వరునికడ నుండి వచ్చిన ఉద్యోగితో మాట్లాడుతూ ఉన్న మాచనమంత్రికి ‘శ్రీ గోన గన్నారెడ్డి ప్రభువులవారు వేంచేసినారు’ అని మనవి చేశాడు.

మాచనమంత్రి మొదలైనవారు ఆశ్చర్యాన ఒక్కసారిలేచి ‘ఏరి ఏరి’ అంటూ సింహద్వారంకడకు వచ్చారు. గోన గన్నా రెడ్డి చిరునవ్వు నవ్వుతూ, ‘మాచనమంత్రిగారూ! నమస్కారాలు! అని నమస్కరించాడు.

మాచనమంత్రి ‘దిగ్విజయమస్తు దీర్ఘాయురస్తు, సత్వర వివాహ ప్రాప్తిరస్తు సుసంతాన ప్రాప్తిరస్తు’ అని ఆశీర్వదిస్తూ ‘మహాప్రభూ! ఎప్పుడు దయచేశారు, లోనికి విచ్చేయండి. ప్రభువుస స్నేహితుడు సుఖముగానే ఉన్నాడు’ అంటూ వారిని లోనికితోడ్కొని వచ్చెను.

గోన: బాబయ్యగారు! పిల్లలందరూ క్షేమమా? పిన్నిగారూ క్షేమమా! మా బావగారూ అత్తవారింటికి వచ్చి మమ్ములనందరినీ మరచి పోయారుకాబోలునని నేనే స్వయంగా ఆయనగారిని కలుసుకొనడానికి వచ్చాను.

మాచ: చిత్తం చిత్తం, మా అక్కిన ఒక నిమేషమైనా తన ప్రభువులను మరిచిపోతాడా! దినదినమూ ఏవో ఉత్తరాలు తమకు పంపుతూనే ఉన్నాడు ప్రభూ! దినదినమూ ఏవో ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి.

గోన: బాబయ్యగారూ! బావమరిదిగనుక ఊరికే వేళాకోళం చేశాను! త్వరగా వెళ్ళి పునస్సంధానం చేసుకొని రావలిసిందని మా పురోహితులచే మంచి ముహూర్తం పెట్టించి పంపాను.

మాచన: ముహూర్త విషయంలో ప్రభువులు నాకు వ్రాసిన ఉత్తరం అందింది. ఈ విషయం మా బావకు, అక్కకు, మామగారికి తెలిపి ఆహ్వానిస్తూ ఓరుగల్లు శుభలేఖలు పంపనా వద్దా అని తటపటాయిస్తున్నాను ప్రభూ!

గోన: శుభలేఖలు పంపి ఆహ్వానించండి, వస్తేవస్తారు. రాలేకపోయినామంచిదే. ఎటువచ్చినా అత్తయ్యగారు రాని లోటు కనబడుతుంది. వెంటనే తాము ఉత్తరాలు వ్రాయించండి. మా చారుడు అవి