పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

178

గోన గన్నా రెడ్డి

అనుకొంటూకూడా కామేశ్వరిని చటుక్కున దరికి తీసుకొని, గాఢంగా కౌగిలించి, ఆమె చిబుకముపట్టి తలపై కెత్తి ‘నువ్వు నా జన్మసాఫల్యలక్ష్మివి కామం!’ అని ఆమె పెదవులు ముద్దిడినాడు. ఆమె సంతోషముతో, పారవశ్యంతో, భయంతో, ఆతని దృఢసంశ్లేషానంద మనుభవిస్తూ ‘చెల్లాయివస్తుంది’ అని కౌగిలి నెమ్మదిగా తప్పించుకొని, ‘అమ్మవచ్చేవేళ అయింది, రేపు’ అని తుఱ్ఱున మాయమైంది.

ఇంతలో మేడ దిగివచ్చి గౌరీదేవమ్మ అల్లుణ్ణి సమీపించి, ‘రావయ్యా పండుకొందువుగాని, సీతమ్మ ఇక్కడికి రాలేదూ?’ అని ప్రశ్నించింది.

పక పక నవ్వు పుత్తడిబొమ్మ సీత సువ్వున పరుగునవచ్చి ‘బావా బావా! పన్నీరు’ అని ఆరంభించి ‘అమ్మతోచెప్పనా?’ అన్నది. అతడు నిర్ఘాంతపోయినాడు. ‘అమ్మా! బావేఁ అక్కకు రత్నాలహారం తెచ్చాడే’ అంది.

‘అమ్మయ్యా’ అని అతడు సంతోషాన నిట్టూర్పు విడిచినాడు.

సీత అక్కినప్రగడ తెచ్చిన రత్నాలహారం సంగతి తెలిసి బావగారి వంక చూచి పక పక విరగబడి నవ్వింది. అక్కినకూడా నవ్వుతూ ‘అల్లరిదానా, నీపని చెబుతా వుండు’ అని లేచినాడు. సీత తల్లివెనుక దాగికొన్నది. అక్కిన మరదలిని చూచి ‘ఇదా నేర్పు? అన్నాడు. సరే పట్టుకో నన్ను’ అంటూ సీత మేడమెట్టుపై కి దూకింది. ఒక గదిలో దూరింది. అక్కిన వెనకాల! ఆ గదిలో కామేశ్వరి తెల్లబోతూ, నవ్వుతూ నిలుచునిఉంది. అక్కిన గుమ్మందగ్గర ఆగిపోయాడు. అక్కగారి వెనుకనుంచి బావగారిని నాలుకచాపి వెక్కిరించి అక్కగారి గదిలో నుంచి తన గదిలోకి గంతువేసి తలుపు దభాలున వేసింది సీత.

కామేశ్వరికీ మాటలేదు, అక్కినకూ మాటలేదు, కామేశ్వరి ఇదివరకు ధరించిన బట్టలు, నగలు మార్చివేసింది. చక్కని సన్నని తెలుపుచీర ధరించి, తెలుపురైక తొడిగి, నీలివల్లె వేసుకొని, దోమజాలరువేసిన తన తల్పంపై పండుకొన పోతున్నది.

అక్కిన సుందరరూపం చిత్రించిన ఫలకం ఆమె మంచాని కెదురుగా ఒక సింహాసనంపైన పెట్టి ఉన్నది. ఆ చిత్రంపైన రాధాకృష్ణుల చిత్రంఉంది. ఆరెండు చిత్రలేఖనాలచుట్టూ పూలదండలున్నాయి. కామేశ్వరి పదిక్షణికా లా లాగున తలవంచి నిలుచుండి, ‘అమ్మవచ్చి మీగది చూపుతుంది’ అన్నది.

నిట్టూర్పు విడుస్తూ నెమ్మదిగా గుమ్మందాటి ఈవలకు అక్కిన వచ్చాడు. అక్కడ సీతమ్మవచ్చి బావగారి బుజాలుపట్టి, ‘బావా! నన్ను పెళ్ళిచేసుకోకుండా మా అక్కను చేసుకున్నందుకు నిన్ను ఈలా ఏడ్పిస్తూ వుంటానులే!’ అన్నది.

“ఎంతకాలం?”