పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

164

గోన గన్నా రెడ్డి

రుద్రమ్మనూ గణపతినీ హతమార్చిన వెనుక తమకు తొమ్మిదికోట్ల మాడల ధనం ఇవ్వవలసి ఉంటుందనిన్నీ మాకు యాదవమహాదేవరాజు వేగు పంపించారు.

లకు: మేముకూడా వేగుపంపించి ఉంటిమి. ఈ రుద్రయామాత్యుల వారే మహాదేవరాజుకడకు వేగు తీసుకువెళ్ళి తిరిగి వస్తూఉంటే దారిలో ఆ రాక్షసుడు పట్టుకొని బందీచేసి తీసుకు వెళ్ళిపోయినాడు,

మురారిదేవుడు: ఎవ డా రాక్షసుడు?

రుద్రయామాత్యుడు: మరి ఎవరున్నారు ప్రభూ? గన్నయ్య! నన్ను బందీగా పట్టుకువెళ్ళి ఏమీ బాధపెట్టనూలేదు, రహస్యములు అడగనూలేదు.

హరిహర: ఎవడండీ ఈ గజదొంగ?

రుద్ర: మా ప్రభువు వారి అన్న కొమారుడు. ఆ ప్రభువు పేరూ, పవిత్రమైన గోనవంశం పేరూ కళంకం చేస్తూ పుట్టుక చక్కా వచ్చాడు.

మురారి: వీడికి గజదొంగ అని పేరు సార్ధకమే! నెమ్మది నెమ్మదిగా మనలో చేరిన సామంతులనందరినీ చావగొడుతున్నాడు. వాళ్ళదగ్గర ధనం దోస్తున్నాడనుకోండి!

లకు: అది వాడు వేసిన మంచి ఎత్తండీ! వాడు దోచడానికి చక్కనివీలు. ఏవో అనుమానాలున్న ప్రభువును చూస్తాడు, ఆ ప్రభువుమీదకు వెళ్ళి విరుచుకు పడతాడు.

హరిహర: ఎంతయినా చక్కని యుద్ధం చేస్తాడు. ఆ నేర్పు తండ్రి పినతండ్రుల పోలికలను బట్టి వచ్చి ఉండాలి.

రుద్ర: ఏమి నేర్పులెండి. దొంగతనాలు చేసేవారు మొదట సులభంగా బళ్ళు దోచుకుంటారు. మనుష్యునికి ఉండే సాధారణపు అశ్రద్ధ దొంగకు మంచి వీలునిస్తుంది. అలాగే నాయకుల అశ్రద్ధ ఈ దొంగకు అదనయింది. రహస్య వర్తనం రెండవబలం, దొంగకు రాత్రిబలం అన్నట్లు. ఇకరమ్మనండి. ఈయనగారి కృత్రిమాలన్నీ ప్రతివానికీ తెలిసిపోయాయి. మగవాడైతే బరిమీదపడి యుద్ధంచెయ్యాలి.

హరిహర: తాము చెప్పింది నిజమే మంత్రీ! ఈ రాజ్యాధిపులంతా, నిమ్మకు నీరెత్తినట్లు గజదొంగను ఈ దేశాన విచ్చలవిడిగా తిరుగనిస్తున్నారు. ఎలా తిరుగనిస్తున్నారు? అదీ నా కాశ్చర్యం.

రుద్ర: సామ్రాజ్యం దుర్బలం కావడమే ఇంతకూ మూల మనుకోండి, ప్రజ లెవరికీ ఆడది రాజ్యం చేయడం ఇష్టంలేదు. ఆవిడ సామంతులకు మాత్రం ఇష్టమా ఏమిటండీ? వారు అదనుకోసం చూస్తూ ఉన్నారు మహారాజా!

లకుమయ్య: శివదేవయ్య అసాధ్యుడు, ఎవరై తేనేమి? తను వేసే ఎత్తుగడలకు సహాయంచేస్తే సరి! తన అవసరం తీరిన తరువాత అతన్ని హతమారుస్తాడు.