పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాకతమ్మ

163

దుర్గాష్టమినాడు ఊరంతా మహోత్సవమై సకల దేవలోకాలు భూమికి దిగివచ్చి, ఓరుగల్లు అమితోత్సాహాన తాండవించిపోయింది. ఆ మహోత్సవ సమయాన రాత్రి కాకతిదేవిని బంగారు సింహవాహనంమీద నగరం అంతా ఊరేగించారు. ఆ ఊరేగింపులో మండలాధిపులు, సేనాపతులు మొదలగువా రెందరో పాల్గొన్నారు. రుద్రదేవమహారాజు భద్రగజారోహణంచేసి కొంతదూరం ఊరేగింపులో పాల్గొన్నారు.

రాత్రి అర్ధయామం దాటినంతట మహారాజు, మండలేశ్వరులు, సేనాపతులు ఎవరి ఇళ్ళకు వారు పోయి తెల్లవారి స్నానాదికాలు నిర్వర్తించుకొని మహానవమి ఉత్సవానికి కోటలోకి వస్తారు. ఆ మహారాజు తర్వత వెళ్ళిపోయిన సామంతులలో గోన లకుమయారెడ్డి మొదటివాడు. తరువాత ఒక్కొక్కరుగా అందరూ వెళ్ళిపోయినారు. ఆ తెల్లవారుగట్ల కాకతమ్మ గుడిబైట వీధిప్రక్క అక్కడక్కడ ఇరువదిమందియు, నల్గురు మనుష్యులు వీధి మండపంలోనూ చేరారు.

గుడిలో అయిదారు దీపాలు మినుకు మినుకు మంటున్నాయి. గుడిలో, గుడి ఆవరణలో, గుడిబైటా వెలిగించి ఉంచిన కాగడాలన్నీ ఆరిపోయినవి. కొన్ని లక్షలమంది జనులు ఉత్సవంలో పాల్గొంటున్నారు. ఉత్సవమంతా కాగడాలే, ఆముదము కాగడాలు, కొబ్బరి కురిడీ కాగడాలూ, నేతికాగడాలతో నగరం అంతా పగలైంది. కాని కాకతీదేవి గుడిదగ్గరమాత్రం కటికచీకటి. ఆ మండపంలో చేరినది గోన లకుమయప్రభువూ, హరిహరదేవుడూ, మురారిదేవుడూ, లకుమయ మంత్రి రుద్రామాత్యుడున్నూ.

“మనం అతి కష్టంమీద కలుసుకొన్నాము. ఈ మధ్య రహస్యచారులను పెట్టి ప్రసాదాదిత్యుడు అతిజాగ్రత్తగా ఉంటున్నాడు. నేను కదిలితే ఆ విషయం ప్రసాదాదిత్యునకు తెలుస్తుంది. ఈ దినం పుణ్యదినం. అందుకనే కాకతమ్మ గుడే మనకు అనువైన ప్రదేశమైనది. మీ నగరి చుట్టూకూడా ప్రసాదాదిత్యుడు రహస్య చారుల్ని కాపుంచి ఉండాలి. ఎప్పుడు తాము ఈ సింహాసనం ఆక్రమించుకుంటారో అని ఎదురుచూస్తూన్నాము, మేమంతా” అని హరిహర మురారులతో లకుమయారెడ్డి అన్నాడు.

హరిహరదేవుడు: గోనప్రభూ! మీరంతా మా పక్షాన పనిచేయడం మాకు లక్ష ఏనుగుల బలంగా ఉంది. మేము యాదవ మహాదేవరాజుకు వేగు పంపించినాము. తమ తండ్రి కృష్ణభూపతి అవసానకాలం సమీపించినదనిన్నీ, తమతండ్రిగారి మూలంగా తాము ఓరుగల్లుపైకి ఎత్తిరావడానికి వీలుకలగడం లేదనిన్నీ, తమతండ్రి పరమపదారోహణ చేయగానే తాము ఇదివరకేసర్వసైన్య సన్నాహంతో ఉండడంచేత వెంటనే బయలుదేరివచ్చి ఓరుగల్లు ముట్టడించి తీరుతామని,