పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

162

గోన గన్నా రెడ్డి

ఆమెను రాత్రి అంతా మేళతాళాలతో, నర్తకీమణుల నాట్యాలతో ఊరేగిస్తారు. దేశ దేశాలనుండి అనేక విచిత్ర వస్తువులను కొనివచ్చి విపణి ఏర్పాటు చేస్తారు. కోనేరు స్నానాలాడి భక్తులు, భక్తురాండ్రు అమ్మవారికి పూజలు చేస్తారు.

ఆ మహోత్సవాలకు రుద్రదేవ మహారాజుకూడా వస్తూఉండేవారు. ఆమె స్వయంగా పూజచేస్తూ ఉండేది. ఆమె మనస్సులో ఉన్న ఆలోచనలకు అంతు లేదు. పూజచేస్తూ అమ్మవారిముందు ఒక దంతపీఠంపై అధివసించి తల్లీ! నా కర్తవ్యం ఏమిటమ్మా? అని ప్రశ్నిస్తూ ఉండేది.

ఆ దినాల్లో ఆమె మనస్సుకు నిలకడలేదు, ‘చాళుక్య వీరభద్రుని వివాహ మాడడమా, లేక బ్రహ్మచారిణిగా గడపడమా’ అనే ప్రశ్నకు ఈ రెండేళ్ళన్నర నుండి ప్రత్యుత్తరంలేదు. చూస్తూచూస్తూ ఉండగా రెండేళ్ళన్నర గడిచి పోయింది. తండ్రిగారు, మాట్లాడరు. శివదేవయ్యమంత్రి ‘ఏమీ ఆలోచించారు’ అని ఎన్నోసారు లడిగినారు.

2

చాళుక్య రాజకుమారుడు వీరభద్రప్రభువు, కాచనాయకుని గోన గన్నారెడ్డి ఏనుగుపై నుండి ఉరివేసి క్రిందకులాగి చంపినవెంటనే సైన్యాలతో మేడిపల్లి పోయి ఆ నగరాన్ని ఆక్రమించుకొని రెండేండ్లయినది. జాయపసేనాని మధుమావతీదేవితో సంగమేశ్వర తీర్థసేవావ్యాజమున నేగి లకుమయారెడ్డి సైన్యాలను ఓడించి వానిని నాశనంచేశాడు. గన్నారెడ్డి మాయచేసి తన పినతండ్రి లకుమయను పట్టుకొని, శివదేవయ్య మంత్రికడకు పంపెను. ఆయనను తన నగరిలోనే ఉంటూ, శివభక్తుడై కాలం గడపవలసిందని రుద్రదేవ మహాప్రభువు హెచ్చరించారు. గన్నారెడ్డి వందిభూపాలాది రాజద్రోహ సామంతులను అనేకులను అణచివేసెను.

గోన గన్నయ్య కాచనాయని నాశనం చేయడంతోనే ఊరకొనక, కాచనాయకునికి సహాయం చేయడానికి సిద్ధపడ్డ కాళింగాంధ్రులపైకి ఎత్తిపోయి వడ్డాది దగ్గర వారి సైన్యాలను మూడువైపులనుండి పొదివి హతశేషుల్ని కూడా విడువకుండా నాశనంచేసినవా డాయెను.

ఆ తర్వాత గన్నారెడ్డి తన కోటకు పోయినాడు. ఆ కోటను పట్టుకోవాలని ఎంతమందో ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం చేసేవారిలో హరిహరదేవ మురారిదేవులు ముఖ్యులు. హరిహర మురారిదేవులు అతిరహస్యంగా లకుమయారెడ్డిని ఓరుగల్లులో కలుస్తూనే ఉండిరి. లకుమయారెడ్డి ఆ కారణంగా తన ఓరుగల్లు నిర్భందవాసము తన మేలుకొరకే వచ్చిందని సంతోషించినాడు.