పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీటలమీది పెండ్లి

9

అతడు గజదొంగా? అతడేనా గోన గన్నారెడ్డి? ఆనాటి పెళ్ళికొడుకున కాతడు పెదతండ్రి కుమారుడా? ఆమె చిరునవ్వు నవ్వుకొన్నది.

మహారాణి అంతఃపురంలో రత్నకంబళ్ళపై నున్నదంతపీఠికలపై అధివసించి ఉన్న రాజస్త్రీలు పెళ్ళికుమార్తె పల్లకి మహారాణి సింహపీఠిదగ్గర దింపగానే ఒక్కసారిగా లేచినిలిచిరి. ఆ తెరల్లోంచి అన్నాంబికాదేవి ఈవలకురాగానే, మహారాణి కూతురుకడకు రెండంగలువేసి, కుమార్తెను గట్టిగా కౌగిలించుకొన్నదాయెను.

“నా తల్లి! ఆ రాక్షసుని కంటపడలేదుకదా! దిష్టితీయించవలె” అని ఆ తల్లి కన్నుల నీరు నింపుకొన్నది.

అవరోధజనం వివాహం చూడటానికి నిర్మింపబడిన ప్రతిసీరల మరుగున నున్న మేడవసారాలలోనున్న స్త్రీజనమెల్ల ఆ గజదొంగ వచ్చిన గడబిడలో అడలిపోయి, మహారాణి మందిరంలోకి పరుగునవచ్చి వ్రాలెను. వాళ్ళందరూ మువ్వన్నె మెకము అడవి సొచ్చినప్పుడు, కురంగీలోకం వణికిపోయినట్లు వణికిపోయారు. ఏట్రింత చెట్టుమీద వాలినప్పు డా చెట్టున నివసిస్తూన్న పులుగు పడతులు భయచకిత కలకలరావాలు సలిపినట్టు ఆ రాచనెలతుక లందరూ గోలు గోలుమనిపోయిరి.

ఆ అదటు ఇంకనూ తీరనేలేదు. రాకొమరితను అచ్చటికి దాసీలు తీసుకురాగానే ఆ అంగనలందరూ కళ్ళ తడిపెట్టుతూ అన్నాంబికాదేవిచుట్టూ చేరారు.

అన్నాంబిక వారందరూ ఆశ్చర్యంలో మునిగిపోయేటట్లుగా చిరునవ్వు నవ్వుతూ ప్రక్కనున్న ఒక చెలితో “అందరినీ కూర్చోపెట్టవే” అన్నది.

ఇంకొక చెలిచెవిలో మరియేమో ఊదినది. అప్పుడు పదిమంది దాసీలు పరుగిడి రాజకుమారి వీణవాయించుకొంటూ అధివసించేపీఠము, దిండ్లు, వీణియ తెచ్చిరి. అన్నాంబిక ఆ పీఠముపై అధివసించి, వీణ ధరించి, మండలేశ్వరుల భార్యలు, సేనాపతుల భార్యలు, మంత్రి సామంతుల భార్యలు, వారి వారి బాలలు, ఆశ్చర్యంతో చూస్తుండగా, తీగలుసవరించి సారెలుబిగించి, పేరంటము సమయములో ముత్తైదువరాండ్ర నలరించుటకువలె నిట్లు పాడెను.

“విరిసినవి కుసుమాలు దరిసినవి వర్ణాలు
కురిసినట్టీ దివ్యపరిమళము జాడలో!
తోట వెలుపల అడవి తోటలోపల మడవ
తోటలో విహరించు తొలిగాలి కే దారి?”

ఆ పాటలోని భావము ఎవ్వరికీ అర్థంకాలేదు. వారందరూ ఒకరిమొగ మొకరు చూచుకొనిరి.

ఆంధ్రస్త్రీలు సుందరులు. వారు సన్ననికౌనుగలవారు. దీర్ఘ నీలకుంతలలు, పుష్పాలంకారప్రియులు, సరిగలతలు, కుట్టిన చీరలు నానావర్ణాలవి ధరింతురు.