పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గజదొంగ

145

కొనేవాడు. “ఈ జీవితమూ నదివంటిదేనా? నదికి ఆ కొండ పుట్టుకస్థలమంటారు. ఆ చుట్టుప్రక్కల ఎన్నోవందలమైళ్ళ ప్రదేశంలో పుట్టే ప్రతి చిన్న నీటిబిందువు ఆ నదికి పుట్టిన స్థలమే! అలా మనుష్య జీవితాలు అనేకవందల బిందువుల కలయికా? అవి మాతృగర్భంలో కలుస్తాయా? మేఘాలు నీటిఆవిరి అని పెద్దలు చెప్పారు. ఆ నీటిఆవిరి సముద్ర జనితం. సముద్రాలలోనికి నదులు, నదులు అనేక జీవబిందువుల కలయిక, జీవసముద్రంలో మృత్యుసూర్యతప్తమై అవి ఆవిరిగా మారి మానవమూర్తి మేఘాలలోచేరి, అక్కడే పెరిగి స్త్రీగర్భకుహరాలలోనుండి బయలువెడలుతాయా జీవితాలుగా? అయితే అవి మనుష్యులలో ఏలా చేరుతాయి? శుక్లం బాల్యావస్థలో పురుషుని దేహంలో లేదు. శుక్లం ఎప్పటికప్పుడు మనుష్యునిలో వృద్ధి. అది స్త్రీ గర్భంలోకిపోయి స్త్రీలో చిన్న తనంలో లేని శోణితబిందువులలో కలిసి ఒక పూర్ణరూపం అవుతుందీ? అది మనుష్యుడుగా ఉద్భవిస్తుందీ?

“ఈ రాజ్యాలు, ఈ నాగరికతలు, ఈ అర్చనలు వివిధ నామాలుగా భగవంతుని భావించుకోడం, కొందరు భగవంతుడే లేడనడం, కొందరు శివుడే భగవంతుడని, కొందరు విష్ణువే భగవంతుడని, కొందరు వీరందరూ హుళక్కే - ఆద్యంత రహితము. నామ రహితము అయిన బ్రహ్మమే నిజము - అని వాదించడం ఏది నిజం?”

ఈలా ఆ యువకుని ఆలోచనలు అనంతములై ప్రవహించేవి. కార్యోన్ముఖుడైనప్పు డేయాలోచనలు ఉండక ఆ కార్యఫలాకాంక్షమాత్రం మాతన్ని ఉఱ్ఱూత లూచేది.

వర్థమానపురంలో తండ్రియైన బుద్ధారెడ్డిప్రభువు గన్నయ్యకు, అతని తమ్ముడు విఠలయ్యకు చిన్నతనంలో నుంచి గురువులచే చదువు చెప్పించినాడు. అతడు పోగానే లకుమయ్య ఈ బాలకుల నిద్దరినీ ఓరుగల్లు చదువుకై పంపినాడు. అక్కడ వారిద్దరూ తమ నగరిలో దాసదాసీజనసేవితులై పెరిగారు. రాజబంధువులలో ఒక ముదుసలియామె వారి పోషణభారం వహించింది.

గన్నయ్య ఎంత చురుకువాడో, విఠలయ్య అంత మందమతి - అసలు చదవలేకపోవడం కాదు. ఏదో చదివేవాడు. విఠలయ్య చిన్నతనాన్నుంచి భీముడే! తోటి బాలు రెవ్వరూ అతనిని మల్లయుద్ధంలో ఓడించలేకపోయేవారు సరిగదా, మొదటి గడియలోనే ఓడిపోయేవారు. అతడు చేయలేని బరువుపని ఏదీ లేనేలేదు.

విఠలయ్యకు ఎప్పుడూ రాదు కోపం ఏపని చేసినా ఉద్రేకము వచ్చేది కాదు. చదువూ అంతంతమాత్రమే! పంచకావ్యాలై సాహిత్యమాపినాడు. ఏదో వ్యాకరణమూ, ఏదో గణితము, ఏదో వేదాంతము చదివినాడు. కాని ఆంధ్ర కర్ణాట మహారాష్ట్రాది ద్రావిడ భాషలూ చదివినాడు. ఆంధ్రభాషలో భారతము, శివనీతిసారము చదివినాడు.