పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

144

గోన గన్నా రెడ్డి

చేయడంలో అందెవేసిన జంతువు’ అన్నా లెక్క లేదు. ‘కళ్ళెంలేకుండా గుఱ్ఱాన్ని స్వారి చేయలేము’ అని లేదు. ఏపని అయినా చేయడానికి ముందుగా సిద్ధం.

చదువులేని సమయంలో, వీరి శిక్షణలేని సమయంలో అంత చిన్నతనాన్నుంచీ గన్నయ్య ఏదో ఆలోచించుకొంటూనే ఉండేవాడు. తెల్లవారగట్ల అతనికి మెలకువ వచ్చేది. బంగారు పట్టుదారాలు కుట్టిన కాశ్మీర శాలువ కప్పుకొని పడుకొన్న చలికాలంలో, కండలుకట్టిన తన బంగారుదేహం పోతపోసిన విగ్రహంలా కనబరచు సన్నని పంచెతో మాత్రం ఆ పట్టు పరుపులపై పండుకొన్న వేసవి కాలంలో, వానకురుయుచు తన శయనమందిరానికి పైన శ్రుతివేసే వానకాలంలో కదలక పడుకొని కలలపా లయ్యేవాడు. పసితనంలో, బాల్యమందు, జవ్వనం పొడచూపే దినాల ఎప్పుడూ ఆలోచనలే!

ఆ ఆలోచనలలో రాజ్యపాలనం, దుష్టనాశనం, ఉత్తమ విద్యావ్యాసంగము, మహోత్తమ వీరవిద్యా కౌశలము సుడులు తిరుగుతూ ఉండేవి. ప్రపంచం అంతా పురాణాలలో ఒకవిధంగా వర్ణించి ఉంది. గణితశాస్త్రంలో ఇంకోవిధంగా వర్ణించి ఉంది. సముద్రం ఎంతవరకు? భూమి ఎంతవరకు? సముద్రం అడుగున భూమి ఆ భూమి అడుగున అంటే ఆ భూమి తవ్వుకుపోతోంటే, దానికి అంతుఉన్నదా? అలా ఎన్నిక్రోశాలు తవ్వుకుపోవాలి? అలా తవ్వుకుపోగా తర్వాత ఏమి ఉంటుంది? ఆకాశంలో ఎగిరే పక్షి ఎంతదూరం ఎగురుతుంది? ఒక మనుష్యుడు ఎగిరేశక్తి సంపాదించుకుంటే ఎంతదూరం ఎగురగలడు? అతని కేమీ అడ్డం రాదా? నక్షత్రాలు వానిదగ్గరకు వెళ్ళి చూస్తే ఎల్లాఉంటాయి? ‘సూర్యగోళం భూమికన్న అనేకలక్షల రెట్లు పెద్దది’ అని గణికాచార్యులన్నారు. ఆ గోళం దగ్గరకు వెళ్ళగలమా? అందులో సూర్యు డెటులుండును?’

ఈలా అంతులేని ప్రశ్నలు వేసుకొని వానికి సరియైన సమాధానాలుతోచక వేదనపడేవాడు. ‘కొండలు, నదులు, అడవులు, వానలు, వరదలు, వేసవి, శీతాకాలం, చలి, వేడి ఇవి ఏలావస్తాయి?’ అని ప్రశ్నించుకొనేవాడు.

వీని అన్నింటికి గురువులనుండి సమాధానాలు కోరేవాడు. వానికి గురువు లిచ్చిన సమాధానాలు ఒక్కొక్కప్పుడు నచ్చేవి కావు. అతని హృదయంలోని ఈ ప్రశ్నపరంపరలవల్ల విపరీతమైన ప్రకృతిజ్ఞానం అలవడింది. ఎప్పుడు వాన వచ్చునో, నది ఈఏడు ఎంతపొంగునో అతనికి కరతలామలకము.

అత డొంటిగా ఏకొండశిఖరంపై నో కూర్చుండి నిశ్చలతారకాయామినీవేళల నక్షత్రపథాలలోనికి, తన హృదయంలోని ప్రశ్నలకు సమాధాన మా చోటుల ప్రత్యక్షమవునేమో యని పారకించి చూచేవాడు. కృష్ణఒడ్డున మధ్యాహ్నాల కూర్చుండి నీటిమేఘాలు; సుడిగుండాలు, నదిలోని రాళ్ళు వాని చుట్టూనదీజలాలు ప్రవహించే విధానము గమనిస్తూ జీవితమునుగూర్చి చర్చించు