పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గజదొంగ

143

మఠం తన ఉనికిపట్టు చేసికొని, అందులో నూరుమంది రక్షకభటులతో, చిన్నయామాత్యులతో, సేనానులతో ఉన్నాడు.

‘గన్నయ్య సైన్యాలు కనబడినవి’ అని వినగానే వారిని నాశనం చేయవలసిందని ఆజ్ఞఇచ్చి తాను శ్రీశైలమందే ఉండి వేగులచేత వార్తలు తెప్పించు కొనుచూ ఉండెను. ఒకనాడు కాశీనుంచి భక్తు లనేకులు శివాచార్యుల శైవక్షేత్ర యాత్రలుచేస్తూ శ్రీశైలం వచ్చారు. వారితో కోటీశ్వరులగు భక్తు లనేకులు వచ్చి ఆ శైవమునులకు, శివాచార్యులకు ఉత్సవాలు చేయించినారు. మైలారభటులు, వీరభద్రభక్తులు నిప్పులు త్రొక్కియు, శూలాలు పొడుచుకొనియు రుద్రతాండవాలు సలుపుచుండిరి. రుంజలు, ఢక్కలు, భేరులు, నాగస్వరాలు దెసలు మారుమ్రోయించుచుండెను. మహాదేవార్చన పరమాద్భుతంగా జరుగుచుండెను. మల్లికార్జున దేవునకు ఎడతెగని అర్చన, అభిషేకము జరుగుచుండెను.

ఆ రాత్రి భక్తులు కొందరు మూడు బంగారు పళ్ళెరాల శ్రీ లకుమయమహారాజునకు శివప్రసాదము అర్పించినారు. వారి భటులు, సేనాపతులు వెండిపళ్ళెరాలతో వచ్చిన శివప్రసాదాల స్వీకరించారు. అత్యంత మధురమై సుగంధపూరితాలైన ఆ ప్రసాదము కాశీనివాసి అయిన పరమశివమఠ పరమశివాచార్యులవారు అర్పించినవని అపరశివమూర్తులైన శివయోగులు తెచ్చి అవి లకుమయారెడ్డి మహారాజు కడ ఉంచినారు.

మహారాజు, ఆయన సేనాపతులు, అంగరక్షకులు, దౌవారికులు, ద్వారపాలకులు, కంచుకులు దాసదాసీజనం అందరూ భక్తితో ఆ ప్రసాదము ఆరగించినారు. వారందరికీ శివప్రసాదమహిమవల్ల ఒడలు తెలియని నిద్ర పట్టినది. ఇంతలో కొందరు క్రొత్తరక్షకభటు లా విడిదిలో అప్రమత్తులై కాపలా కాయుచునేఉండిరి. తెల్ల వారినది. నిద్రమత్తు వీడి రక్షకభటులు, సేనానాయకులు, తదితర పరివార జనము లేచినారు. కాని మహారాజు లకుమయారెడ్డి ప్రభువు తమ హంసతూలికా తల్పంమీద లేరు! ఒక్కసారి ఆ విడిది గృహాల్లో ‘మహారాజు!’ అని గగ్గోలు బయలుదేరింది.

గోన గన్నారెడ్డి చిన్నతనాన్నుంచి ఉత్సాహంతో పొంగిపోయే బాలుడు. చదువుకొనడంలో, ఆటలు ఆడడంలో, వీరవిద్య శిక్షణపొందడంలో ఎప్పుడూ సంతోషం, ఉప్పొంగు. గురువు ‘ఈ పని చేయగలవా రాజకుమారా’ అంటే ‘చేస్తా! చేస్తా! చేస్తా! ఓ చేసితీరుతా’ అని ఆ పనియొక్క కష్టం, నిష్ఠురము, స్వరూపం ఒక్క నిమేషం ఆలోచించి, వానిని అధిగమించే విధానం ఇంకో నిమేషం ఆలోచించి, మనస్సు, బుద్ధి, హృదయము ఆ పనిపై నిశితంగా ప్రయోగించి మూడవ నిమేషంలో నిర్వర్తించేవాడు. ఈ పాఠము ‘కొత్త’ అని లేదు. అ పండు బాణంతో కొట్టడం ‘కష్టసాధ్యం’ అని లేదు ‘ఆ గుఱ్ఱం పొగరుగలది, రౌతులను పరాభవం