పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

గోన గన్నా రెడ్డి

వివాహానికే ఇష్టంలేని అన్నమాంబిక ఈవిధంగా తనకన్న రెండేళ్ళు మాత్రమే పెద్దవాడై, విక్రమంలో తనతోకూడా సాటిగా ఏమాత్రమూ నిలువలేని వరదారెడ్డిని వివాహం చేసుకొనడానికి ఏమాత్రమూ ఇష్టపడకున్నను తండ్రి బ్రతిమాలుటతో సరేనని ఒప్పుకొన్నది.

5

పెళ్ళిప్రయత్నాలన్నీ ఎందుకో తొందరగా జరిగాయి. అశ్వచారులు అతి త్వరితంగా శుభలేఖలు చుట్టాలకు అందిచ్చినారు. ఆదవోనినగరం అంతా సైన్యాలతో నిండింది. వీరనాయకులతో, దుష్టతురగరేఖారేవంతులతో నిండిపోయింది.

రేచర్ల వారు, విప్పర్ల వారు, మల్యాలవారు, కోటవారు, వెలనాటివారు, సాగివారు, చాళుక్ములవారు మొదలగు ఆంధ్రక్షత్రియవంశాలవారు వివాహానికి వచ్చి యుండిరి.

ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడే అన్నాంబికాదేవికి తెలుస్తూనే ఉండినవి. ఆమె తన వివాహాన్నిగురించి ఆలోచించడం మానివేసింది. తమ కులదేవత విశాలాక్ష్మీదేవి కృప ఎల్లాఉంటే అల్లాగే జరుగుతుంది అని నిస్పృహ చేసుకొని ఊరుకుంది.

ఆమెచేత ఏమేమి తంతు చేయించారో, ఆమె కేమీ గుర్తులేదు. తన్ను బంగారుస్యందనంలో ఎక్కించి కాండపటాలు చుట్టూపూన్చి చెలికత్తెలు రాగా, వివాహ వేదికలోనికి తీసికొనివచ్చారు దాసీజనులు అన్నదిమాత్ర మామె ఎరుగును.

ఇంతలో గన్నారెడ్డి గజదొంగ వచ్చాడు. అందరు గొల్లుమన్నారు. ఆ సమయంలో ఒక గంభీరస్వరం “ఆగండి” అని వినిపించింది. ఆ కేకలో ఎనిమిది బారుల నిశితత్వంఉంది. ఆ కేకలో పదహారు ఉరుముల మహానాదముంది. ఆ కేకలో సప్తసముద్రాల లోతులున్నాయి.

చెలికత్తెలు గజగజ వణుకుతూ ఆగిపోయినారు. స్యందనంలోనుండి అప్పుడన్నమాంబిక ఒక కాండపటము ప్రక్కకు ఒత్తిగించి ఆ కేకవేసిన మహాపురుషుని చూచినదాయెను. ఆ సమయములోనే ఆ పురుషుడును తన్ను చూచు మంచుశిఖరాల మధ్య నిలిచిఉన్న అపరాజితాదేవి మోమువలె తెరల మధ్య కాన్పించిన వధూ వదనము వీక్షించెను.

వారిరువురి చూపులు ఏడుక్షణములకాలం ఒకదాని నొకటి ఎదుర్కొని, సంధించి, కలిసిపోయినాయి. ఎవరుముందు కంటిరెప్పలు వాల్చినారో వా రిరువురకూ తెలియదు. ఇంతలో తండ్రిగారి ఆజ్ఞవల్ల చెలులు రాజకుమార్తె స్యందనం, మహారాణి అంతఃపురంలోనికి తీసుకొనిపోయినారు.