పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

142

గోన గన్నా రెడ్డి

కార్యాలమీద చెదిరిపోవాలి రెండుజట్లు ఒకచోట ఉండకూడదు. నేను వచ్చి ఆ ఉత్సవంలో ఉంటాను. ఆతర్వాత నేను చెప్తాను మీరు ఏమిచేయాలో. మా చిన నాయనగారు మాయంకాగానే మీరందరూ చప్పగా, చల్లగా పారిపోవాలి. ఈలోగా మన అంచెధారలు మా చిననాయనగారిని ఓరుగల్లు చేర్పించగలవు. నేను నా సాధారణపు గజదొంగరూపంలో ప్రత్యక్షమవుతాను. మా చిననాయనగారికి, అంగరక్షకులకు గొప్ప శివభక్తులు ఒక చిన్న బంగారుపళ్ళెంలో ప్రసాదం ఇవ్వగలరు. వారు చక్కగా నిద్రపోతారు. మీశిష్యులు వర్థమానపురాంతఃపుర రక్షక భటులవుతారు. ఇక తరువాయివిషయాలు నే నక్కడ చెప్పుతాను.

సబ్బనాయకుడు మరి పది క్షణికాలు మాట్లాడి మాయమైపోయాడు.

• • • •

శ్రీశైలము పురాతనకాలమునుండీ మహాశైవక్షేత్రము. ఆంధ్రులు మొదట నుండీ శైవమతావలంబకులు. శాలివాహనశక పూర్వమునందు ఒక వేయి సంవత్సరాలనుండి శ్రీశైలము అనేక ఋష్యాశ్రమసంకీర్ణమై బహుజనాకర్షమై పవిత్ర యాత్రాస్థలమై ఉండేది. బౌద్ధమతముగాని, జైనమతముగాని ఈక్షేత్రాన్ని చెక్కు చెదర్చలేకపోయాయి.

ఈ దివ్యపర్వతము చుట్టూ ఉన్న నాడులలో ఆంధ్ర మహారాజవంశాలు అనేకం ఉద్భవించి దేశాలు పాలించాయి. ఈ పర్వతానికి తూర్పున పల్లవ భోగములో రాజులు పల్లవులై విజృంభించారు. వారికి ముందు ఇక్ష్వాకులు, వారికిముందు శాతవాహనులు సామ్రాజ్యాలేలినారు.

శ్రీశైలానికి దక్షిణంగా చళుకవిషయ రాజవంశమువారు చాళుక్యులై శాతవాహనులకు సామంతులై వారి మాండలీకులుగా, సేనాపతులుగా పడమటి కుంతల దేశానికి పోయి అక్కడ బాదామిలో శాతవాహనులకు పిమ్మట స్వతంత్రులై చక్రవర్తులైనారు. వారిలో వేరొకశాఖ తూర్పునకువచ్చి తూర్పుచాళుక్యులుగా వేంగిలో సామ్రాజ్యం స్థాపించారు.

శ్రీశైలానికి పడమటిదేశం శాతకర్ణాటదేశమై, కర్ణాటమై చాలాకాలం శాతవాహనభృత్యవంశమైన శాతకర్ణాటుల రాజ్యమై, ఆ వెనుక యాదవులపాలై, గాంగుల పాలై, చివరకు కొంతభాగం భల్లాణులచేతికి వచ్చింది.

అట్టి దివ్యపర్వతం కాకతీయ గణపతిదేవ సార్వభౌముని కాలంలో విశ్వేశ్వర గోళకమఠము, శివమఠము మొదలైనవానితో నిండి ఒక మహాపట్టణంలా విరాజిల్లుతూ ఉండేది. ఈ కాలంలో ఆ ప్రదేశమంతా అడవి ఏడాది కొకసారి శివరాత్రి నాడు ఉత్సవం జరుగుతుంది.

ఆ శ్రీశైలంలో శివభక్తులగు రాజన్యులు అనేక మఠాలు కట్టించి శివయోగులకూ, ఆరాధ్యులకూ ఆశ్రమాలు నిర్మించి అర్పించుచుండిరి. లకుమయారెడ్డి ఒక