పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

138

గోన గన్నా రెడ్డి

ప్రతిగృహమూ, అలాగే ఉన్నది. పైన పాడు, లోన సౌందర్యము. ఆ కోట బాగుచేయించే సమయంలో గన్నారెడ్డికి నాలుగునిధులు దొరికాయి. ఒక నిధిలో వెండి బంగారు నాణెములు కొన్నిలక్ష లున్నవి. ఇంకొక నిధిలో నవరత్నఖచిత సువర్ణాభరణాలు వేలకువే లున్నవి. ఒక చోట పూర్వకాలపు ఆయుధాగారము కాబోలు! దానినిండా పూర్వకాలపు ఆయుధాలు తుప్పుపట్టినవి, తుప్పుపట్టక ఇప్పటికీ సరియైన స్థితిలో ఉన్నవి దొరికినవి. నాల్గవనిధిలో రాగి కడ్డీలు, సీసపుకడ్డీలు, ముక్కలు, ముద్దలు, వెండి ఇటుకలు ఇరవై ముప్పదిబళ్ళ వస్తువులు బయల్పడినాయి.

గోన గన్నారెడ్డికి ఇట్లు మూలధనం దొరికింది. సైన్యాలతో పోయి చిన్న సామంతులకు కొద్దికొద్ది పన్నులు విధించి ధాన్యాలు, ధనాలు సేకరిస్తున్నాడు. ఈతడు దాగుకొని ఉన్న ఆ పాడుపట్టణం చుట్టుప్రక్కల ఉన్న రైతులు కూరగాయలను పండించి అతని సైన్యాలకు అందిస్తున్నారు. వారి కాతడు ఎక్కువ మూల్యం అందిచ్చేవాడు.

ఆ రహస్యదుర్గానికి చుట్టూఉన్న చెంచులూ, బోయలూ, గోన గన్నారెడ్డి సైన్యానికి ఉపసైన్యాలుగా ఉంటూ ఆ దుర్గరహస్యం లోకానికి ఎవ్వరికీ తెలియకుండా కాపాడుతున్నారు. ఆ పరిసరాల ఎక్కడో గన్నారెడ్డి దుర్గము ఉందని మాత్రం అందరికీ తెలియును. కాని అది ఎక్కడో ఎవ్వరికీ తెలియదు.

2

ఆ రహస్యదుర్గంలో గన్నారెడ్డీ, అతని సహచరులూ సర్వకాలం మల్లయుద్ధాలలో శిక్షణ పొందుతూ ఉంటారు. గన్నారెడ్డి వారికి యుద్ధవిధానాలు అనేకం నేర్పుతూ ఉంటాడు, సైనికు లనేకులు భార్యలను, ప్రియురాండ్రను, తల్లులను తెచ్చుకొన్నారు. ఒక్కొక్కప్పుడు సైనికుల వినోదార్థము తోలుబొమ్మలు, యక్షగానాలు, జక్కులకథలు, పల్నాటి వీరగాధలవంటి బుర్రకథలు, పురాణ శ్రవణము, సంగీతసభలు, విద్యావ్యాసంగము, నాట్యసభలు ఆ రహస్య దుర్గంలో జరుగుతూ ఉంటాయి.

గన్నారెడ్డి మంత్రులలో దిట్టమైన ఆరువేల నియోగి బ్రాహ్మణ బాలకులున్నారు. ఆ బాలకులలో మేటి సోమయామాత్య కుమారుడైన చినఅక్కినమంత్రి. ఈ అక్కిన శివదేవయ్యమంత్రి శిష్యుడు. రాజనీతి తన దేశికునికడ సంపూర్ణంగా గ్రహించి ఆ చిన్న తనంలోనే పెద్దరాజ్యరధపు పగ్గాలను దృఢముష్టితో పట్టుకున్నాడు.

గన్నారెడ్డి చినఅక్కినమంత్రిని తనకు ముఖ్యమంత్రిగా, అపసర్ప విద్యాపరిశోధకుడుగా ఏర్పరచాడు. అపసర్పనాయకుడు సబ్బప్ప ఆ విద్యలో ఆరితేరినవాడు. ఓరుగల్లు అపసర్పగణనాయకుడైన శ్రీ విరియాల గొంక