పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓరుంగల్లు

133

రుద్రమ్మ తరిమింది. వా రిద్దరూ ఆ మందిరంనుంచి ఇంకో మందిరంలోకి పరుగిడిరి.

16

ఆ రాత్రి వా రలా పరుగెత్తుతూ ఉంటే, మహారాణి ముమ్మడమ్మ అక్కడకు వచ్చుటకు అనుమతి వేడుతూ ప్రతీహారిణిని పంపింది. చిన్నబిడ్డలా ఆటలాడుకొను రుద్రదేవికడకు దాసీలు ఎవ్వరును రా వెరచినారు. ఒక కొత్త ఆపె ఎవ్వరో దూరాన భయభక్తులతో నిలిచి ఉండడం అన్నాంబిక కనిపెట్టింది.

వగరుస్తూ, నవ్వుతూ అన్నాంబిక రుద్రదేవికడకు పోయి ‘అక్కా, ఎవ్వరో నీకోసం వచ్చారమ్మా’ అని తెలిపింది. రుద్రదేవి అన్నాంబిక దృష్టివైపు పరికించి ముమ్మడమ్మ ప్రతీహారిణిని చూచి అన్నాంబికను దగ్గరకు లాక్కొని ‘చెల్లీ! అల్లా పిలవాలి నన్ను; లేకపోతే నీపని పట్టించిఉందును. ఇక నా కొమరిత, నా చెల్లెలు, నా భార్య అయిన ముమ్మడాంబికను చూద్దువుగాని’ అంటూ రుద్రాంబిక ఆ ప్రతీహారిణిని దగ్గరకు రమ్మని సైగచేసి ‘మహారాణిగారు మా అలంకారమందిరంలోకి వస్తారుగాక! వారిని మేము ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాము’ అని తెలిపింది.

ఆ ప్రతీహారిణి భక్తితో తలవంచి వెనుకకు నడుచుచు ముమ్మడాంబికాదేవి నగరిలోనికి వెళ్ళిపోయింది.

రుద్రదేవియు, అన్నమదేవియూ అలంకారమందిరంలోకి వెళ్ళినారు. అక్కడ వారు కూర్చుండి మాటామంతీ చెప్పుకుంటోంటే ఘల్లు ఘల్లుమని బంగారుగజ్జెలు చప్పుడుకాగా ముమ్మడమ్మ చెలికత్తెలతో గుమ్మందగ్గరకు వచ్చింది. చెలులు గుమ్మంకడనుంచి వెనక్కు వెళ్ళారు. ముమ్మక్క లోనికి వచ్చింది.

ఆమె లోనికి రాగానే రుద్రదేవీ, అన్నాంబికా లేచిరి. రుద్రదేవి ముమ్మడమ్మకు అన్నాంబికను చూపిస్తూ ‘దేవీ! ఈ బాల ఆదవోనిప్రభువుకు ఏక సంతానం, అన్నాంబిక. మన చెల్లెలు సుమా!’ అని తెలిపింది. ముమ్మడమ్మ పాదాలకు అన్నాంబిక నమస్కరించింది. ముమ్మడమ్మ నవ్వుతూ అన్నాంబికాదేవిని భుజాలతో లేవనెత్తి ‘చెల్లీ! నువ్వూ, నా భర్తగారూ ఆడుకుంటూ ఉండడము నాకు దాసీల వల్ల తెలిసింది. మా భర్తగారితో ఆటలాడుకొనేందుకు ఇంకో భార్య వచ్చిందేమో అని భయపడి, ఉడుకుబోతుతనంతో చక్కావచ్చాను’ అంటూ పక పక నవ్వింది.

ఆ ముగ్గురు బాలికలు విరగబడి నవ్వుకున్నారు. ఆనందంతో ఉప్పొంగి పోయారు. వారి హృదయాలు త్రివేణీ సంగమం అయ్యాయి. ముమ్మడమ్మా, రుద్రమ్మా మరింత సన్నిహితులగుటకు అన్నాంబిక కారణం అయింది.