పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓరుంగల్లు

129

నువ్వు ప్రార్థించిన విషయం నేను బాగా పరిశీలించి తగినపని చేస్తాను.’ అంటూ ప్రక్కన కూర్చుండబెట్టుకొన్నది. రుద్రాంబిక కుప్పాంబికాదేవి వైపు చూచి, కన్నుమూసి తెరిచింది. ఆమెయు అవునన్నట్లు కన్నుమూసి తెరిచింది.

రుద్ర: అయితే! నేను శ్రీ శివదేవయ్య దేశికులవారిని ఈ విషయం పూర్తిగా విచారించి గన్నయ్యప్రభువుతో రాయబారాలు సాగించమంటాను.

కుప్పాం: మహారాణి! మా తమ్ములిద్దరూ పసివాళ్లు. మూర్ఖులై అలా గజదొంగలని అపకీర్తిపాలైనారు.

రుద్ర: కుప్పాంబికాదేవి! గన్నయ్యప్రభువు మూర్ఖుడంటే నేను ఒప్పను. రాజ్యాలు ఎల్లా స్థాపన అవుతున్నాయి? రాజులందరమూ బ్రహ్మ దేవుని భుజంలోనుంచి వచ్చారని నమ్ముతున్నారా? రాజరికం విశ్వపురుషుని భుజాలు అన్న ఉత్తమభావాని కది వ్యాఖ్యానం! పురాణాలు చదవలేదా దేవీ? ఎన్ని రాజవంశాలు రాలేదు, పోలేదు? శివదేవయ్య మంత్రులవారు మా కాకతీయ వంశచరిత్ర నాకు చెప్పారు. బొట్టభేత ప్రభువు మా పూర్వికు డెల్లాగో మాండలీకు లయ్యారు. ఆయన కంచిపల్లవులకు మాండలీకుడు! ఆయన చిన్నతనంలో విరోధులు వారి రాజ్యమైన అనుమకొండ , కొఱవిదేశం ఆక్రమించుకొంటే ఆయనకు సామంతులైన విర్యాల ఎఱ్ఱనప్రభువు ఆ విరోధిని జయించి కొఱవిదేశంలో మా పూర్వికుని సింహాసనం ఎక్కించి చనిపోయాడట. ఆతర్వాత ఎఱ్ఱప్రభువు భార్య కామమసాని తాను స్వయంగా సేనలు నడిపి, కాకతీయ మండలమైన నబ్బిసాహిర మండలం ఆక్రమించిన విరోధుల నాశనంచేసి ఆ బొట్టభేతప్రభువును తిరిగి కాకతిసింహాసనం ఎక్కించింది.

అన్నాంబిక: మహారాణీ! కాకతీయవంశము భగవంతుని దయవల్ల రాజ్యం సంపాదించినది.

రుద్ర: కుమారీ! రాజ్యాలు సంపాదించినవా రందరూ భగవంతుని దయవల్ల సంపాదించినవారే. ఈ భూమండలం ఏలే రాజులందరూ సూర్య వంశస్థులో, చంద్రవంశస్థులో! మనం అంతా ఆర్యధర్మం త్యజించిన దుర్జయ వంశస్థులం! మనం అంతా ఆర్యధర్మం తిరిగి గ్రహించినా యజ్ఞోపవీతం తీసివేయడంమూలాన సుక్షత్రియత్వం పోగొట్టుకొని, మనుమకులజులమై పోయాము. గన్నారెడ్డి ప్రభువు మాకు తెలిసినంతమట్టుకు ఏవిధమైన గజదొంగ తనమూ చేయలేదు. అల్లా చేసినట్లయితే శిక్షిస్తాము. లేకపోతే నెమ్మదిగా చెప్పించి రాజధానికి రప్పించుతాము.

అన్నాం: వారిరాజ్యం వారి కిప్పించరా మహారాణీ?

రుద్ర: గన్నారెడ్డి అలా పారిపోకపోతే ఇప్పించిఉండేవారమే. అతడు తాను వీరుడననుకొని పృథ్వీరాజ్యం వీరభోజ్యమని, స్వయంగా రాజ్యం