పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓరుంగల్లు

121

వర్థన, అభినవగుప్త, దండి, క్షేమేంద్ర, ఏకావళీకార, మమ్మట, ఉద్భట, హేమచంద్రాది మహామహుల అలంకార శాస్త్రములు నేర్పియు, నేర్పించియు ఆమెను మహోత్తమవిద్యాసంపన్నను చేసినాడు. (ఈమె మనుమరాలే పిమ్మట ప్రతాపరుద్రదేవుని వలపించిన మాచల్దేవి).

ఈమె నగరు - సార్వభౌముల నగరికి దక్షిణమున, ఆ నగరు కంటియున్న జాయపసేనాని నగరు - నంటియున్నది. ఈ నగరులో అనధ్యయన దినములలో తప్ప ప్రతిదినమునందు సాయంకాలము పందొమ్మిదవ నాళిక రాచనగరు మోసాల యందు మ్రోగినప్పటినుండి గోధూళికాలంవరకూ సభ జరుగుతుంది. ఆ సభలో పండితులు, కవులు, గాయకశ్రేష్ఠులు, నర్తకీమణులు తమ తమ విద్యలు చూపుతూ ఉంటారు. నెలకు ఒకసారి పూర్ణిమముందు శుక్రవారంనాడు కామేశ్వరీపూజానిరతురాలైన మధుసాని లేక మధుమావతీదేవి ఉదయమూ, రాత్రీ కామేశ్వరీదేవికి దివ్య నాట్యము అర్పిస్తుంది. ఆ సమయం దాహూతులయ్యేవారు పండిత వృషభాలు, రాజసింహాలు, కవిహంసలు, గాయకతల్లజులు, మంత్రిపుంగవులు మాత్రమే. ఆమె నాట్యప్రదర్శనం చూడడం తపఃఫలంగా ఎంచుకొనేవారు.

ఆంధ్ర నర్తకీమణులకు అత్యంత ప్రియమైనది నందికేశ్వర సంప్రదాయం. నాట్యము మూడుపాళ్ళు, నృత్తము ఒక పాలును వారు ప్రదర్శిస్తారు. ఆంధ్ర నాట్యము జగత్ప్రసిద్ధము. ఆంధ్రులంత నృత్యప్రియు లా దినాల ఇంకొకరు లేరు. సర్వశాస్త్రపారంగతురాండ్రై దేవగణికలకు పాఠాలు నేర్పడం ప్రాథమికవిద్యగా ఎంచుకొనే కైశికీమణులతో కామేశ్వరీకథ చెప్పుతూ నాట్యమాడే జక్కుల పురంధ్రులతో ఆంధ్రనాట్యవృక్షము పుష్పఫలావృతమై పెరిగింది.

నాట్యమున పూర్వరంగము ఇష్టదేవతా ప్రార్థనాత్మకమై, దివ్యగాథా నాట్యపూర్ణమై ఉంటుంది. ఉత్తరరంగము, ఉత్తమ మానవ చరిత్రాభినయపూర్ణము, చతుర్విధాభినయములతో, శృంగార కరుణ భక్తిరసాలుగా కావ్యాలు నాట్యం చేయబడుతాయి.

మధుసాని ఒక సార్వభౌమ నగరియందు మాత్రమే నాట్యముచేస్తుంది. శ్రీశ్రీ రుద్రదేవ మహారాజులు సార్వభౌమ ప్రతినిధిగా అభిషేకించిన ఆ ఉత్సవాలలో రుద్రదేవమహారాజుసభలో శుక్రవారాలు కానటువంటిన్నీ, అనధ్యయనదినాలు కానటువంటిన్నీ దినాలలో ఆ మహారాజు సభ నలంకరించి ఉండగా మధుసాని ఉదయం ప్రధమయామమధ్యమునుండి ద్వితీయయామ మధ్యంవరకూ ఏడున్నర ఘటికలు తానే నాట్యం చేస్తుంది.

ఆమె నాట్యసభకు ఉద్దండులను మాత్రమే ఆహ్వానింతురు. ఆ రుద్రేశ్వర నామక మహాసభలో సార్వభౌమ సింహాసనానికి దిగువగా రాజప్రతినిధి సింహాసనంపై రుద్రదేవి పురుషవేషంతో అధివసించిఉంది. ఆమెకు కుడిప్రక్క మహా