పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

114

గోన గన్నా రెడ్డి

ఈ కమ్మను గణకునిచే తాటియాకుపై వ్రాయించి ఉత్తరాల అంచెల మంజూషలో పెట్టించి తానే స్వయముగా కుచ్చులున్న పట్టుదార మొకదానిని చుట్టును చుట్టి శివదేవయ్యమంత్రి విచిత్రమైన ముడి నొకదానిని రచించినాడు. మరునాడు వేకువను ఆ కమ్మను గర్భమందు దాచుకొన్న ఆ మంజూష ప్రయాణం సాగించింది.

ఆ ఉత్తరము ప్రయాణముసాగించిన మరునా డుదయం ఈ అంచెల వార్త లందించు శాఖకు నాయకుడు శ్రీశివదేవయ్యదేశికుల దర్శనము ప్రార్థిస్తూ వారి సభలో కనిపెట్టుకొనియున్నాడు.

అర్థముహూర్తకాలానికి దేశికులు శివపూజను చేసికొని, అభ్యంతర సభా మందిరాన గూరుచుండి, వార్తాహర దళనాయకుని లోనికి రావలసిందని ఆజ్ఞ పంపినారు. ఆ నాయకుడు భయముక్రమ్మిన హృదయంతో మహామంత్రి కడకు పోయి పాదాభివందన మాచరించి, భక్తితో నిలబడినాడు.

“ఏమయ్యా! మావార్త గమ్యస్థానాన్ని చేరిందా?”

“మహాప్రభూ! మా వార్తాహరదళమును తాము కటాక్షించాలి. తమ లేఖ గజదొంగ గోన గన్నారెడ్డి చేతులలో పడినదండీ. అందు మా వార్తాహరుని లోపము లేదండీ!”

“ఏమిటీ! గజదొంగ చేతిలో పడినదా ఆ ఉత్తరము? అది ఎట్లా సంభవించినదయ్యా? సూర్యునిలా గతులు దప్పని మీ దళవీరుల ప్రజ్ఞలు ఉడిగి పోయినాయా?”

“మహాప్రభూ! మావార్తాహరులలో చివరి అంచెవాడు సాయంకాలానికి అమరపురం చేరబోతున్నాడు. ఆ ఊరింకా ఒక అర్ధగవ్యూతి ఉందనగా ఏబది మంది అశ్వికవీరులు మార్గాన్ని కీవ లావలనుండి వచ్చి మా వార్తాహరుని దారి అరికట్టారటండీ. మా వార్తాహరుడు తమ ఆజ్ఞాముద్రిక చూపించినాడటండీ. అయినా వారు లెక్కచేయక, వెనుకనుంచి గట్టివస్త్రం ఒకదాన్ని మావార్తాహరుని నెత్తిపై వేసి, ఆతనిని దిట్టమైన త్రాళ్ళతో బంధించారటండీ. వెంటనే మంజూష హరించికొని పోయినారటండీ!”

“దేశం అరాజకం వాత బడిందా?”

“చిత్తం మహామంత్రీ!”

“ఆ వెనుక ఏమయింది?”

“ఆ పిమ్మట మా వార్తాహరుడు కట్టుత్రాళ్ళతోనే మా శిబిరం చేరినాడటండీ. వెంటనే మేఘాలలాంటి అశ్వాలపై జట్టు కిరువురు చొప్పున చుట్టు ప్రక్కల ప్రదేశాలన్నీ వెదకడం ప్రారంభించాము.”

“మంచిది!”