పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓరుంగల్లు

113

అనిశివదేవయ్య ఆలోచించి జేగంట మ్రోగించెను. ఆ పిలుపునకు వచ్చిన బ్రాహ్మణుని చెవిలో ఏదియో తెల్పెను.

9

ఓరుగల్లు మహానగరమునుంచి మహావేగంతో ఒక ఆశ్వికుడు బయలుదేరినాడు. దిక్కులు తెల్ల తెలవారుతుండగానే ఆ అశ్వికుడు మహామంత్రి ఆజ్ఞాముద్రిక చూపిస్తూ కోటద్వారమూ, నగరద్వారమూ దాటి మహావేగంగా ప్రయాణంచేస్తున్నాడు. ఆ మేలుజాతి అశ్వము పారశీకదేశమునుంచి వచ్చింది. హయహృదయము తెలిసి, తన్ను ప్రేమించేవానికి మాత్రమే మాటవింటు దా అశ్వము. తన ధర్మం నెరవేర్చటంలో సూర్యాశ్వాలే దానికి దీటు. ప్రతిఅశ్వానికి పేరు ఉంటుంది. కాని ఆ జాతి అశ్వాలన్నిటికీ వ్యక్తిత్వం ఉంటుంది.

చక్రవర్తి అశ్వశాలలో, ఈ ఉత్తమాజానేయాలు మూడువేలున్నాయి. దాని రౌతు లందరు అశ్వహృదయం ఎరిగినవారే. వారికి ఆ అశ్వాలు తమ బిడ్డలకన్న ఎక్కువ. ఆ అశ్వాలను ఉత్తములైన అతిథులను ఉపచరించినట్లుగా సూతులు, రౌతులు పోషిస్తారు.

‘వాయుసుత’ అనే ఆ గుఱ్ఱము ఒకసారి సకిలించి గాలిపీల్చి తల ఎత్తి తూర్పుదిక్కు గమనించి, ముక్కుపుటాలు విస్ఫారితంచేసి, ఖురాలతో నేలను ద్రవ్వుతూ నిలుచున్నది. ఒక నిమేషంలో కోటద్వారం, రెండవ నిమేషంలో నగరద్వారము దాటింది. మహామంత్రి ఆజ్ఞను చూపించుటే తడవు.

మహావేగంతో వెళ్ళే ఆ తురంగము చిన్నచిన్న గ్రామాలనేకం దాటింది. జాము ప్రొద్దెక్కేసరికి ఆ రౌతు రుద్రవరగ్రామం చేరాడు. ఆ గ్రామం బుద్ధపుర, వర్ధమానపురాది నగరాలకు పోయేదారిలో ఉన్నది. ఓరుగల్లు నగరానికా గ్రామానికి ఇరవై అయిదు గవ్యూతుల దూరం ఉన్నది. రుద్రవర గ్రామంలో సార్వభౌముల అశ్వశాల ఒకటి ఉన్నది. అది ఒక చిన్న కోటవలె ఉంటుంది. ఆ కోటలో ఎప్పుడూ పది అశ్వాలుంటవి. సార్వభౌమునివార్తలు దేశం అంతా పంపడానికీ, దేశవార్తలు సార్వభౌమునికి అందజేయడానికి అటువంటి అశ్వశాలలు దేశంలో పది పదిహేను, ఇరవై గవ్యూతుల దూరంలో అక్కడక్కడ ఏర్పాటుచేసినారు. ఈ యాశ్విక స్థానాలలో అశ్వికులు ఇతర విధు లేమీ నిర్వర్తించ నవసరములేదు. ఈ తురంగాలను యుద్ధాలకు ఉపయోగించరు.

మన అశ్వికుడు రుద్రవరం చేరి మహామంత్రి తన కిచ్చిన కమ్మఉన్న చిన్న మంజూషను ఆ శాలాధికారి కిచ్చెను. అతడు వెంటనే సిద్ధముగనున్న వేరొకరౌతు కది ఇచ్చి, గమ్యస్థానమును తెలియజేసెను. ఆ రౌతు నిర్దిష్ట మార్గాన్ని వెడలి పోయినాడు. ఈ రీతిగా అంచెలుగా ఆ కమ్మ ప్రయాణిస్తున్నది.