పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

గోన గన్నా రెడ్డి

3

దక్షకృతావమానంచే విశ్వంయావత్తూ బూదిచెయ్యాలన్న రుద్రుని కోపంతో రాజశ్రేష్ఠుడు, వయోవృద్ధుడు శ్రీ శ్రీ మహారాజాధిరాజు శ్రీ గోన లకుమయారెడ్డి మండలేశ్వరులు మంత్రాలోచనసభ చేరినారు. వర్ధమానపురంలో కోటలో రాజనగరిలో, అన్నిచోటులలోనూ వచ్చిన వార్తలవల్ల జనులు గజిబిజిపడిపోతూ ఉన్నారు.

ఆదవోనినుంచి మహారాజు రాజ్యసైన్యాలు, మంత్రివర్గం, రాజబంధువులు, సామంతులు యావన్మందీ వచ్చిచేరినారు. నేడు రాజ్యసభలో మంత్రాలోచనకై సభికులు ముందే వచ్చియున్నారు. మహారాజులు రావడంతోనే అందరూ లేచి జోహారులన్నారు. ఆయనకన్నుల్లో నిదాఘవేళాప్రచండ మార్తాండదుర్నిరీక్ష కిరణాలు వెలిగిపోతున్నావి. ఆయన వెలిగడ్డము వణకుతూ ఉన్నది. దీర్ఘమైన బాహువులు పైకీ క్రిందికీ ఆడుతూ ఉన్నవి. కుడిచేత్తో అయన ఇటు అరజానెడు అటు అరజానెడు ఉన్న ధవళమైన మీసాల్ని సవరిస్తూనే ఉన్నారు.

సచివాగ్రణి లేచి మహారాజులంవారి దిక్కు మొగమౌతూ “ప్రభూ! ఈ దొంగ, ఈ పాపి, మచ్చలేని దుర్జయవంశానికి అవకీర్తి తెస్తూఉన్నాడు. పాలసముద్రమువంటి గోనవంశాన హాలాహలం పుట్టుకువచ్చి నీచాతినీచుడయ్యాడు. అతని జాడతీసి అనుచరులు యావన్మందితోనున్నూ హతమార్చమంటారో, జీవంతో పట్టుకువచ్చి నేలఖయిదులో పారవేయించమంటారో మహాప్రభువుల వారు సెలవియ్యాలి. సేనానాయకులవారు అరణ్యంచుట్టి, దొంగల్ని బంధించడానికై నాలుగు సైన్యదళాల్ని పంపించి ఉన్నారు. స్వయంగా రెండు అశ్వదళాలతో, ఒక గజసైన్యంతో ఈదినమే ప్రయాణం అవుతూ ఉన్నారు. దేవర వారి ఆజ్ఞ” అని విన్నవించాడు.

సభఅంతా నిశ్శబ్దం అయింది. ఇంతలో చటుక్కున హజారం ముంగల రణగుణధ్వని వినబడినది. ప్రతీహారివచ్చి “మహాప్రభూ, దేవరకు ఎల్లప్పుడూ అఖండజయం! శ్రీ శ్రీ మహారాజకుమారులు అడవికిపోయి కొన్ని సైన్యాలతో విజయంచేస్తూ ఉన్నారు. అశ్వచారులు హుటాహుటివచ్చి వార్త అందించుకున్నారు” అని మనవిచేసెను.

మహారాజు చటుక్కున లేచినవా డాయెను. సభ అంతా లేచినది. మహారాజు త్వరితగమనంతో సభాప్రాంగణంవరకూ సభ వెనుక నడుస్తూ ఉండగా, వెళ్ళినారు. “జయ! జయ! దిగ్విజయీభవ! శ్రీకుమారమహారాజులం వారికి జయ!" అనే జయజయధ్వానాలు మిన్నుముట్టుతూ ఉండగా, శ్రీ వరదారెడ్డి మహారాజకుమారులంవారు అశ్వసైన్యాధ్యక్షుడు, దండనాయకుడు, తలవరి చమూపతులు కొలుస్తూఉండగా ఉత్తమమైన పంచకళ్యాణిగుఱ్ఱంపై అధివసించి వచ్చి, దిగి, తండ్రిగారికి పాదాభివందనం ఆచరించారు. మహారాజులంవారు ఎడమ