పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

102

గోన గన్నా రెడ్డి

యోగులు, జాయపసేనాని, మహాతలవరి తన్ను పరివేష్టించి వుండగా తెల్లని గడ్డము మీసాలతో వజ్రకిరీటంతో, బంగారుతొడిగి రత్నాలు పొదిగిన చేతికఱ్ఱ కుడిచేత ఆనుకొని, ఎడమచేయి జాయపనాయకమహాసేనాని భుజంమీద వుంచి నెమ్మదిగా నడుస్తూ, గరుత్మంతుని చూపులతో, గరుడనాసికతో భుజమువరకూ వ్రేలాడే చెవులకు మకరకుండలాలు ప్రకాశించుతూ వుండగా వేంచేసినారు.

అప్పు డా సార్వభౌముడు సాక్షాత్తూ హిమవత్పర్వతాకారుడై వుండెను. ఆ చక్రవర్తి తెల్లని నురుగువలె వుత్తుంగతరంగాలతో వుప్పొంగే సముద్రునిలా వుండెను.

వేదమంత్రాలు నింగిముట్టుతూవుండుగా శ్రీ గణపతిదేవసార్వభౌములు సింహాసనం అధివసించారు. శ్రీశ్రీశ్రీ రుద్రదేవప్రభువులు యువరాజ సింహాసనం అధివసించినప్పటినుండీ, చక్రవర్తి సార్వభౌమసింహాసనం అధివసింపలేదు. ఈ రెండేళ్ళతర్వాత ఇప్పుడు సింహాసనం అధివసించి నిండోలగ్నమున్న గణపతి మహాప్రభువు సుధర్మలో దేవేంద్రునిలా వుండినవారాయెను.

అంతలో మళ్ళీ త్రయీపాఠాలు, తుమ్మెదఝంకారంలా, మహానది వురవడిలా, సముద్రఘోషలా, మేఘగర్జనలా వినిపించినవి. భేరీభాంకార, నాగస్వర, శంఖ, కాహళ, ముఖవీణా, మృదంగాది శుభవాద్యాలు భోరుకొన్నవి.

అ సద్దున్నూ అయినవెనుక “శ్రీ శ్రీ సమధిగత పంచమహాశబ్ద మహామండలేశ్వర, అన్మకొండపురవరేశ్వర, పరమమాహేశ్వర, పతిహితచరిత, వినయవిభూషణ, శ్రీ స్వయంభూదేవర దివ్యశ్రీపాదపద్మారాధక, మూఱరాయజగదాళ, మహా మండలేశ్వర శ్రీ శ్రీ శ్రీ రుద్రదేవమహారాజా! జయ జయ!” అని వంది మాగధులు పాటలు పాడినారు.

ఇంతలో శ్రీ కుమారరుద్రదేవ మహారాజులవారు గంభీరంగా నడుస్తూ వచ్చినారు. సార్వభౌములుతప్ప, తక్కినవారందరు లేచి నిలుచుండిరి. శ్రీ రుద్రదేవ ప్రభువు తన సేనాపతులతో, మంత్రులతో వచ్చెను. ప్రభువునకు కుడివైపుననే శ్రీశ్రీ చాళుక్యవీరభద్రమహారాజు నడచి వచ్చినాడు.

యువరాజు సార్వభౌమసింహాసనంకడకు వచ్చి తండ్రికి మోకరించి నమస్కరించెను. సార్వభౌముడు చేతులు చాచి, రుద్రప్రభువును అర్ధసింహాసనము అధివసింపచేసెను.

అందరును యథోవితముగ ఆసీనులైరి. నాగమదేవి అనే నర్తకి మేళముతో వచ్చి శంభువిజయమును నాట్యముచేసినది. ఆ వెనుక సంగీతశాస్త్ర నిధి అయిన కేతనామాత్యులు వీణపై రాయిగరగించు గాంధర్వవిద్య ప్రదర్శించినారు. ఆ వెనుక శివతత్వసారమునుండి ఒక పరమమాహేశ్వరుడై న ఆరాధ్యబ్రాహ్మణ గురువు శివ మాహాత్మ్యము సార్వభౌమునకు, సభ్యులకు పాడి వినిపించెను.