పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓరుంగల్లు

101

ఆ యా మంత్రులకడ వివిధోద్యోగులు, వివిధోపశాఖలు పాలనముచేస్తూ ఉంటారు.

5

రుద్రదేవమహా ప్రభువు శ్రీగణపతిదేవసార్వభౌముని ప్రథమపుత్రిక అనిన్నీ, కుమారులు లేకపోవడంవల్ల కొమరితనే సార్వభౌముడు యువరాజుగా నిశ్చయించి పురుషవేషమువేసి వీరవిద్యలన్నీ నేర్పుతూ, చివరకు జాయపసేనాని కొమరిత ముమ్మడమ్మను ఇచ్చి వివాహం చేశారనీ ఈ అఖండ ఆంధ్రసామ్రాజ్యానికి భావి చక్రవర్తిని శ్రీరుద్రదేవే అనిన్నీ, ఆమె శ్రీ రుద్రదేవ సార్వభౌములుగా చతుస్సముద్రముద్రిత భూమండలం ఏలుతూ వుంటారనీ, స్వస్తి, శ్రీశాలివాహనశక 1183 దుర్మతి సంవత్సర వైశాఖ బహుళ పంచమీ సోమవారంనాడు మహాసభలో శ్రీశ్రీశ్రీ మల్లికార్జునారాధ్య గురుమహాదేవుల అపరావతారమైన శివదేవయ్యదేశికుల వారు ప్రకటించారు.

సభఅంతా ఆనంద జయజయద్వానాలు కావించారు.

సభలో మహాసేనాపతులు, సేనాపతులు, మంత్రులు సామంతులు, వివిధ సభాసభ్యులు, వర్తకులు పండితులు అందరూ కిటకిటలాడుతూ ఉన్నారు.

ఇంతలో వేదాశీర్వాదదివ్యనాదాలు బయలుదేరాయి. శుభవాద్యాలు, సామ్రాజ్య భేరీభాంకారాలు వినిపిస్తూవున్నాయి. స్వయ భూదేవ, కేశవదేవాది దేవాలయాలలో గంటలు మారుమ్రోగుతున్నాయి. లాసికాబృంద వాచికాభినయ మధురస్వరాలు వినవస్తున్నాయి. వేదపనసలు పఠిస్తూ త్రయీపాఠులగు శ్రోత్రియులు సభాస్థలం లోకి వచ్చారు. వందిమాగధులు.

“బహుపరాక్, శ్రీశ్రీశ్రీ సమధిగతపంచమహాశబ్ద మహామండలేశ్వర, పరమమాహేశ్వర, అనుమకొండ పురవరాధీశ్వర, పరనారీసహోదర, లాడచోడ కటకచూఱకార మన్నియభేంటకార, విభవదేవేంద్ర, సత్యహరిశ్చంద్ర, శ్రీస్వయం భూదేవర దివ్యశ్రీపాదపద్మారాధక, పరవరప్రతాపాశ్రిత, వితరణచణ, శరణాగత వజ్రపంజర, పరబలసాధక, ఉపమన్యుప్రముఖ భక్తజనానందకార, వైరిసంహరణ, చతుస్సముద్రవలయ దిక్పూరితకీర్తి, సప్తమచక్రవర్తి, అదిరాజ చారుచరిత, రాజరాజేశ్వర, సుస్థిర నిజరాజాన్వయచంద్ర, ప్రత్యక్ష ప్రమథమగణావతార, సుజనైకమిత్ర, కదనప్రచండ, చలమర్తిగండ, శ్రీమన్‌మహారాజాధిరాజ! రాజపరమేశ్వర! శ్రీకాకతీయ గణపతిరుద్రదేవసార్వభౌమా! జయ జయ! జయ జయ” అంటూ స్తోత్రపాఠం చేసిరి.

సభికులందరు ఒక్కసారిగాలేచి, పూర్ణకంఠాలతో జయజయధ్వానాలు చేసిరి. అప్పుడు డెబ్బదిరెండు సంవత్సరాల ఈడున్న శ్రీగణపతిచక్రవర్తి, అనేక శివ