పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓరుంగల్లు

99

తులు, కొందరు కొన్నిశాస్త్రాలలో ఉద్దండపండితులు. ఆ పండితులు అందరూ దేశాలు తిరుగుతూ, కొన్ని దేశాలలో నివాసంచేస్తూ, ఎప్పటివార్త అప్పటికి శివదేవయ్య దేశికులకు అందజేస్తూ ఉంటారు. ఈ బ్రాహ్మణబృందానికి నాయకుడు సోమనాథబట్టు. ఆయన భరద్వాజగోత్రుడు, వారి కాపురము బుద్ధపురము. శ్రీ మల్యాలప్రభువంశానికి వారు పురోహితులు. ఈ సోమనాథభట్టోపాధ్యాయులకు మంత్రగురువు శివదేవయ్యదేశికులు.

కాకతీయసామ్రాజ్యాపసర్పగణానికి నాయకుడు ప్రసాదాదిత్యనాయడు. వారు తెచ్చే వార్తల విధానము వేరు. వాని విషయము వేరు. శ్రీ శివదేవయ్య మంత్రికి శిష్యులైన ఈ పండితులు తెచ్చు వార్తలు వేరు. ప్రసాదాదిత్య నాయకుని చారులు మూడు తరగతులవారు.

ఒకతరగతివారు ఓరుగల్లు నగరంలో అప్రమత్తులై తిరుగుతూ, అధర్మం తలెత్తకుండా చూస్తూఉంటారు. ఆ దళములో అయిదారువందలమంది చారులున్నారు. బిచ్చగాళ్ళవలె, శివయోగులవలె, యాత్రికులవలె, నగరములో నివాసముచేయు సాధారణపౌరులవలె, వివిధవృత్తులవారివలె వారు నివసించుతూ ఆ నగరానికి రహస్య తీక్ష్ణలోచనాలవలె ఉంటారు.

రెండవతరగతి చారులు దేశం అంతా తిరుగుతూ రాజకీయవిషయాలూ, ఇతర ధర్మవిషయాలూ కనిపెట్టుతూ ఉంటారు. మూడవతరగతి చారులు అఖండులు. వారెవరో ప్రసాదాదిత్యనాయకునకు, ఆయనక్రింద ఉద్యోగులైన తంత్రపాలునకు, ముఖ్యచారదాయకునికీ మాత్రమే తెలియును. ఈ చారులు వేయి మంది ఉంటారు. వీరు సర్వరాజ్యాలూ తిరుగుతూ ఉంటారు. ఎక్కడెక్కడి విషయాలు పోగుచేసుకు వస్తారు. వర్తకులుగా, వర్తకుల లేఖలుగా, పుణ్యక్షేత్ర యాత్రికులుగా తిరుగుతూ ఉంటారు. వీరందరూ బహుభాషావేత్తలు, వివిధదేశాచార జ్ఞానసంపన్నులు, చారులందరూ సర్వయుద్ధవిశారదులు.

సోమనాథభట్టోపాధ్యాయులు ఆనవాలుకట్టలేని వేషాన వచ్చి పాదాభివందన మాచరించి నిలుచుండగానే శివదేవయ్య దేశికులవా రా పురుషుని తేరిపార చూచినారు. ఆయన చూపు లా పురుషుని వైద్యుడు రోగిని చూచునట్లు, దూడలలో ఆవు తనదూడకై చూచునట్లు, స్వర్ణకారుడు వివిధరత్నాలను పరీక్షించునట్లు తీక్ష్ణముగా ప్రసరించునవి. అప్పటికి ఆయన ఒక నిర్ణయానికివచ్చి, చిరునవ్వుతో ‘సోమనాథార్యా! అంత పరిశీలన చేయకపోయినచో నేను నిన్ను గుర్తుపట్టలేక పోయే ఉందును’ అని పలికినాడు.

సోమనాథభట్టాచార్యు లప్పుడు నవ్వుచు, ‘ప్రపంచములో ఎవ్వరినైనా నేను మోసగించగలను. కాని నాగురుదేవులకడమాత్రం నా పప్పు ఉడికేదిలేదు’ అని తాను ధరించిన పాములవాని వేషమును కొంతతీసి అక్కడున్న ఒకపీఠంపై