పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

98

గోన గన్నా రెడ్డి

శివ: ఆ మనుష్యుని జాడలు కొంతవరకు వచ్చి ఆగిపోతున్నవి. రోగ మూలం తెలియకుండా, బాధబాధకూ మందు పుచ్చుకుంటే క్రొత్తబాధలు వస్తూ ఉండడమే కాని ప్రయోజనకారి కాదు.

ప్రసా: దేశికులవారూ! మీ ప్రయత్నాలు సాఫల్యం పొందకపోవడం అనేది ఉండదు.

శివ: దేశంలో ఉన్న నీచహృదయులకూ, తప్పుదారుల బడినవారికీ ఆ తెరచాటువ్యక్తి బలం ఇస్తున్నాడు. అతని ఉద్దేశం తానే చక్రవర్తి కావాలని! ఆ వ్యక్తి చాలాబలవంతుడు అయిఉండాలి. కాకతీయసామ్రాజ్య రహస్యాలన్నీ పూర్తిగా తెలిసిఉన్నవా డాతడు. ‘ఆడదా రాజ్యం చెయ్యడం’ అనే మిష ఆ పురుషుని అంబులపొదిలోని పెద్ద ఆయుధం. కాబట్టే ఆ ఆయుధంలోని సగం బలం తీశివేయడానికి భావి ఆంధ్ర సామ్రాజ్యభారం వహించబోయేది రుద్రమదేవి అని లోకం అంతా తెలియజేస్తున్నాము.

ప్రసా: మనకు బాసటఅయ్యే ప్రభువులు దేశంమీద ఉండకపోరు.

శివ: ఎవరినీ నమ్మకూడదయ్యా! చివరకు శ్రీ గణపాంభాదేవిగారి భర్తనూ నమ్మకూడదు. దినాలలాంటివి. అయినా నా వేగులవల్ల పూర్తిగా నాకు ఎంతో నమ్మకం కలిగినవారు, దిట్టమైనవారు అన్ని నాడులలోనూ ఉన్నారు. ఇప్పటికి మూడు తరాలనుంచి శాంతి, సుభిక్షము, ఐశ్వర్యము, ఆనందము అనుభవించే ఈ మహాదేశము, నేడు ఎవరో కొందరి దురాశలకు లోనై స్వనాశనం చేసుకోదు. అది మన ముఖ్యబలం. అందుకనే ప్రజలందరూ కాకతీయ సామ్రాజ్యానికి అండగా ఉంటారు.

ప్రసాదాదిత్యనాయకులు కలకదేరని మనస్సుతో శివదేవయ్య పాదాలకు నమస్కరించి అనుమతినంది వెడలిపోయెను.

ఆ వెంటనే ఒకవ్యక్తి శివదేవయ్యదేశికుల అనుమతిని వారికడకు వచ్చి సాష్టాంగనమస్కార మాచరించి, ఆజ్ఞకై తలవంచి దూరాన నిలుచుండెను.

ఆ వచ్చిన నూతనపురుషుడు ఒక సద్బ్రాహ్మణుడు. ఆయన ముఖమందు వైదికతేజము తాండవిస్తున్నది. ఆయన వేదవేదాంగ పారంగతుడు, అద్వైతి. నాట్యశాస్త్రంలో దిట్ట. వేషాలు వేయడంలో ఆ ఉత్తమ బ్రాహ్మణు డద్వితీయుడు. ఆయనకడ అనేకులు గణికలు నాట్యశాస్త్ర మభ్యసించి అప్సరసలని పేరు పొందారు. ఆ బ్రాహ్మణుడు ఎల్లాంటి మారు వేషాలన్నా వేయగలడు. ఆ యా వేషాలకు తగిన భాషలు నేర్చినవాడు. చూపులు చేష్టలు, నడక అన్నీ ఆ వేషంలో పాలూ నీళ్ళూ కలిసినట్లు కలసిపోతాయి.

ఈమారువేషాలు వేసుకొనే బ్రాహ్మణచారులు శివదేవయ్యమంత్రికొలువులో పదునారుమంది ఉన్నారు. వా రందరూ పండితులు. కొందరు సర్వశాస్త్రపారంగ