పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓరుంగల్లు

97

ప్రసా: గురుదేవా! ఆ విషయంలో గోన గన్నారెడ్డి లోకమంతా చాటింపు చేస్తూనే ఉన్నాడు.

4

అప్పుడు శివదేవయ్య ప్రసాదాదిత్య ప్రభువును తీక్ష్ణంగా చూచి ‘సేనాధిపతీ! ఇప్పుడు రుద్రదేవ ప్రభువుపై కుట్రచేసివా రందరికీ ఒక్క మహానాయకత్వం ఏదో తెర వెనుక వుంది. ఆ నాయకత్వం ఎవరిదా అని వేయివిధాల ప్రయత్నంచేసి కనుక్కుంటున్నాను, కాని ఏవిధమైన ఉదంతం నాకు దొరకటంలేదు.’

“శివదేవయ్య దేశికుల గరుడలోచనాలు చూపుల కందని ఆ మహా వ్యక్తి ఎవరు గురుదేవా?”

శివ: ఆ విషయం తెలియకేకదా ఈ చిన్న చిన్న కుట్రదారులను విజృంభింపనిస్తున్నది.

ప్రసా: లకుమయ్యా?

శివ: లకుమయ్యాకాదు, కోటారెడ్డీకాదు, మరెవ్వరూకారు.

ప్రసా: యాదవప్రభువా?

శివ: యాదవప్రభువు తన కక్ష మొదటినుండీ సువ్యంక్తంచేస్తూనే ఉన్నాడు.

ప్రసా: హరిహర, మురారిదేవులా? వాళ్ళే అయితే నా చేతులతో వాళ్ళను నూనె పిండుతాను మహామంత్రీ!

శివ: కాదయ్యా సేనాపతీ! వాళ్ళ దినచర్య అంతా నాకు మరుక్షణం తెలుస్తోంది. నాశక్తిని వమ్ముచేస్తున్న ఆ మహావ్యక్తి ఎవరో, ఈ భయంకర నాటక సూత్రధారి! ప్రయత్నాలన్నీ వృధా అవుతున్నాయి. నే నొకణ్ణే కాదు “ఆ మహావ్యక్తిఎవరో అని ఆకుట్రలో చేరినవారే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నాటకాన్ని నడిపే ఆ సూత్రధారి జ్ఞానాతీతుడై ఉన్నాడు.

ప్రసా: చివరకు మన ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనం అయిపోతాయేమో గురుదేవా?

శివ: ఆ భయం నాకు లేకపోలేదు. ఇందుకు ఒకటే పాశుపతం వుంది. దాన్ని ప్రయోగించాను. మొదట అది సాధారణబాణం అనుకున్నాను, కాని అఖండాస్త్రమని నానాటికి వ్యక్తమవుతున్నది. ఆ సూత్రధారు డెవరో తెలుసుకొని, వానిని నాశనం చేయగలిగింది ఆ ఒక్క అస్త్రమే!

ప్రసా: ఉత్తమశక్తిసంపన్న అయిన ఒక్క మహారాజ్ఞి రాజ్యం చేయడానికి పురుషులకు ఇంత ఇష్టం లేకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంటున్నది! గాలితో ఏమి యుద్ధం చేయగలం? ఆ మగవాడు బయటపడితే మన బలా బలాలు తెలుసుకోవచ్చునుకదా?