పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

96

గోన గన్నా రెడ్డి

క్రొత్తదినాలలో ఒకసారి శౌణయాదవులకు మరపురాని బుద్ధిచెప్పారు. ఆ రక్షలు ఇప్పటివరకూ మాయలేదు. కృష్ణభూపతి బొందెలోప్రాణం ఉన్నంతవరకూ యాదవ సైన్యాలు దేవగిరి దాటవు. మీరు నమ్మండి.

ప్రసా: మహాదేవరాజు తండ్రిమాట వినేదినాలు దాటిపోలేదుకదా అని?

శివ: మహాదేవరాజుకు తండ్రిమీద గౌరవంపోయి నాలుగు సంవత్సరాలయింది. కాని తక్కిన మాండలికులకు, సేనాపతులకు కృష్ణభూపతి అంటే అనన్యమైనభక్తి. ఆ కారణముచేతే మహాదేవుడు ఓరుగల్లు మహానగరాన్ని తలచుకొని నోరూరి చప్పరిస్తూంటాడు.

ప్రసా: అయినా మనం సర్వసిద్ధంగా ఉండవలెకదా?

శివ: గజదొంగ అయిన గోన గన్నారెడ్డి ప్రభావమువల్ల రేచర్లవారి, మల్యాలవారి, కోటవారి, నతనాటిసీమవారి సైన్యాలన్నీ సతమతమై చేయాడకుండా ఉన్నవి.

ప్రసా: అవునవును, అతడు మెరుములా ఒకసారి శ్రీశైలందగ్గర ఉంటాడు, ఇంతట్లో ఇటు మంత్రకూటందగ్గర కనబడుతాడు.

శివ: మీ రేచర్ల వారి పిల్లవాండ్రుకూడ కొంతమంది ఆ జట్టులో చేరారు. అతని సైన్యం నానాటికీ పెద్దదయిపోతున్నది.

ప్రసా: గురుదేవా! నిన్నసాయంకాలం మల్యాల గుండయ్య ప్రభువుగారు వచ్చినారు. వారితో వారి రాణిగారితో కలిసి ఆదవోని ప్రభువు కుమార్తె అన్నాంబిక వచ్చింది. గోన గన్నయ్య ఆ రాజకుమార్తెను ఆదవోని నుంచి ఎత్తుకొనివచ్చి అక్కగారిదగ్గర ఉంచితే గుండయ్య ప్రభువు ఆదవోని రాజుతో పోరాడటం ఒప్పక ఈ నగరం వచ్చాడని చారులు వార్త పట్టుకువచ్చారు.

శివ: కుప్పసానమ్మ, అన్నాంబిక ఈ దినము సాయంకాలమే మహారాజుల దర్శనం చేసుకుంటారు. అక్కడి సంఘటనలవల్ల ఆదవోని రాజుకూ మల్యాలవారికీ యుద్ధం వచ్చితీరుతుంది. కోటారెడ్డి మనవైపు ఉండవలసిన వాడు. అందుకని మీరు చక్రవర్తి పేరిట ఆదవోని ప్రభువుకు ఒక శ్రీముఖం పంపించండి. “అన్నాంబికారాకుమారి నారాంబా పేరంబా మహారాణుల శుద్ధాంతాలలో సగౌరవంగా చక్రవర్తి కన్నకూతురులా ఉంటుంది. వీలువెంబడిని రాకుమారికను ఆదవోని చేర్చగలవార” మని.

ప్రసా: ఏమిచక్కని ఆలోచన చేశారండీ గురుదేవా! ఓయి వెర్రి కోటారెడ్డి! ఏకపుత్రికావిషయంలో నీకు శ్రద్ధలేకపోతే ఆమె నీకు దక్కదని ఎంచుకోలేకపోయావుకదా!

శివ: ప్రసాదాదిత్యప్రభూ! శుభముహూర్తం చూచి శ్రీ కుమారరుద్రదేవప్రభువు చక్రవర్తికి పెద్దకొమార్తె అని ఏదో ఒక మహోత్సవ సందర్భంలో లోకానికి తెలియజేయవలసి ఉంది.