పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓరుంగల్లు

95

రుద్రదేవుడు ఉద్వాహమైన ముమ్మడమ్మకు నిజమైన వివాహం కావాలి. ఈ ధర్మం నిర్వహించబడాలి అంటే రుద్రదేవుడు సంపూర్ణంగా రుద్రదేవి కావాలి. ఆ పిమ్మట రుద్రదేవప్రభువే ముమ్మడాంబికకు భర్తను వెదకాలి!

స్త్రీ సకలాంధ్ర సామ్రాజ్ఞి అగుటకు వ్యతిరేకించి క్రోధోన్మత్తులై పరవళ్ళు త్రొక్కబోయే దక్షులకు వీరభద్రులు కావాలి. మహావీరులనుగన్న ఆంధ్రమాత కడుపు చల్లగా ఆ వీరభద్రులు శివజటాజూటోద్భవు లయినారు.

తనకు ఏనాటి కానాడు చారులు, యథార్హ వర్ణులు, ప్రణిధులు, గూఢ పురుషులు ఆంధ్రభూమండలం అంతటినుండీ వార్తలు తీసుకొని వస్తున్నారు.

మనస్సులోమాత్రం వికారం పొందినవారు, ‘స్త్రీ చక్రవర్తిని అవునా’ అని ఆక్షేపించేవారు, తామే మేటి మొనగాండ్రు గాదలచుకొన్నవారు, సన్నాహాలు చేస్తున్నవారు, సైన్యాలు కూర్చేవారు, రహస్యంగా రాయబారాలు నడుపుతున్నవారు - ఓహో! ఆంధ్రదేశం రాజద్రోహిమాండలికులతో నిండి ఉన్నది.

కాలవైపరీత్యము! యుధిష్ఠిర సింహాసనం ఈనాటి కటులైనది. ధర్మం సందుదారుల నడువవలసిన వ్రాత వచ్చింది. ఇంకను ఎట్టివ్రాత ఈ దేశానికి విధి వ్రాసి ఉంచినాడో?

ఈలా ఆలోచనలు తరంగమాలలా దొర్లుకువస్తూ ఉండగా శివదేవయ్య దేశికులు భోజనానంతరము తన ఆలోచనామందిరములో కూర్చొని ఉండిరి. ఇంతలో ప్రసాదాదిత్యనాయనింవారు దర్శనార్ధము వచ్చినారని లోనికి వార్తలు పంపినారు. వార్త తెచ్చిన శివభక్తునితో ప్రసాదాదిత్యుల ప్రవేశపెట్టవలసిందని చెప్పి శివదేవయ్య శివనామామృత శ్లోకాలు తీయని కంఠంతో పాడుకుంటూ ఉండిరి.

శ్రీ రేచర్ల ప్రసాదాదిత్యనాయనింవారు పద్మనాయక వెలమరెడ్లు. ఆ దినాలలో ఆంధ్ర క్షత్రియ కులాలవారికి భోజన ప్రతిభోజనాలలోగాని, వివాహాదులలోగాని నిషేధాలు లేనేలేవు. కాకతీయ వంశానికి మొదటినుండి రేచర్లవారు మాండలికులై, అంగరక్షకులై, వంశరక్షకులై కాకతీయరాజుల ప్రేమకు పాత్రులై ఉండిరి.

ప్రసాదాదిత్యులవారు లోనికి ప్రవేశించి శివదేవయ్య దేశికులకు పాదాభి వందన మాచరించి, వారిచే ఆశీర్వాదా లంది, వారిచే చూపింపబడిన ఆసనం అధివసించిరి.

ప్రసా: గురుదేవా! దేవగిరి యాదవులు ప్రబల సన్నాహాలు చేస్తున్నారని వేగులు మహాప్రవాహంలా వచ్చిపడుతున్నాయి. మనం ఏమరుపాటుగా లేముకదా?

శివ: యాదవులు మనదేశంమీదకు ఇప్పట్లో కన్నెత్తిచూడరు. శ్రీ సార్వభౌములవారు చిన్నతనంలో ఒకమాటు, నేను మంత్రిత్వభారం గై కొన్న